చంద్రగిరి టీడీపీ టిక్కెట్ రేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి – పులివర్తి నానికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టేందుకు ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సై అంటున్నారు. చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్‌గా పులివర్తి నాని ఉన్నారు. ఆయనే విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ డాలర్స్ దివాకర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రోత్సాహం లేకపోతే ఆయన హడావుడి చేయరని పార్టీలో చర్చించుకుటంున్నారు.

సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించలేకపోతున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు పురిటిగడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని విడిచి.. కుప్పంకు మకాం మార్చారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మధ్యలో ఓసారి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. మొత్తం నాలుగు సార్లు గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ తరఫున జయకేతనం ఎగురవేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైసీపీ నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన గల్లా అరుణ కుమారిని ఓడించగా, 2019లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై విజయం సాధించారు.

ఇప్పటి వరకూ పులివర్తి నాని క నుంచి డాలర్స్ దివకార్ రెడ్డి

ప్రస్తుతం పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే చంద్రగిరి టీడీపీ టికెట్ డాలర్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశిస్తున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్ళపల్లి గ్రామం. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో దివాకర్ రెడ్డి చురుగ్గా పనిచేశారు. యువరాజ్యం జిల్లా అధ్యక్షుడుగానూ కొనసాగారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ చంద్రగిరి టికెట్ ఆయనకు తృటిలో మిస్సైంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత డాలర్స్ దివాకర్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుటంున్నారు.

టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నం

రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని డాలర్స్ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే డాలర్స్ దివాకర్‌రెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో తనకు అనుచరగణం ఉన్నారని, వారందరి మద్దతుతో చంద్రగిరి కోటలో పసుపు జెండా ఎగురవేస్తానని దివాకర్ రెడ్డి చెబుతున్నారు. అయితే పులివర్తి నాని మాత్రం తనకే టిక్కెట్ వస్తుందని నమ్ముతున్నారు.