ధాక్రే, బీజేపీ, ముంబై…

మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ వ్యవహారం తర్వాత ఇప్పుడు శివసేన వైరి వర్గాలు దుమ్మెత్తుపోసుకోవడం మళ్లీ ప్రారంభించాయి. దసరా వేడుకల్లో కూడా ఆ రెండు వర్గాలు తిట్ల పురణం అందుకున్నారు. పైగా ప్రధాని మోదీని, బీజేపీని వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించాయి. ఇదీ మా ముంబై అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలకు చేసుకోవడం ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వంతయ్యింది.

మంబైని విడదీయాలనుకుంటున్నారు..

శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముంబైలో అట్టహాసంగా దసరా ర్యాలీ నిర్వహించింది.అందులో మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుపైనా,కేంద్ర ప్రభుత్వంపైనా ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆరోపణలు చేశారు. ముంబై ప్రాధాన్యతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఠాక్రే అన్నారు. కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముంబై నుంచి గుజరాత్, ఢిల్లీలకు మార్చేస్తున్నారని,ఆ క్రమంలో ముంబైని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఠాక్రే వ్యాఖ్యానించారు. అసలు ముంబైను, మహారాష్ట్రను విడదీసే ప్రయత్నం జరుగుతోందని కూడా ఠాక్రే ఆరోపించారు. ఇండియా గ్రూపును వ్యతిరేకించే మోదీ, పాకిస్థాన్ క్రికెట్ జట్టును మాత్రం సాదరంగా ఆహ్వానించారని అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో వారికి బహుమతులు అందజేశారని ఠాక్రే అంటున్నారు. పైగా సంప్రదాయ గుజరాతీ నృత్యం చేస్తూ వారిని ఆహ్వానించారన్నారు.

ముంబైపై భయం వద్దంటున్న షిండే..

శివసేనను చీల్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండే మాత్రం ఠాక్రేపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆయన కూడా ఓ దసరా ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి ముంబైను ఎన్నటికీ విడగొట్టే ప్రసక్తే లేదని షిండే అన్నారు. ముంబైను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నిస్తోందన్నారు. శివసేన అధికారంలో ఉన్నప్పుడు ముంబై కార్పొరేషన్లో ఠాక్రే అవినీతి చేశారని అందుకే ఇప్పుడు విచారణకు భయపడి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని షిండే అన్నారు.

ఠాక్రేపై బీజేపీ సీరియస్

దసరా ర్యాలీలో ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం, మహారాష్ట్ర దసరా ర్యాలీలో ఠాక్రే వ్యాఖ్యలను రాష్ట్ర నేతలు కేంద్రం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.లేని ఆరోపణలతో బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఒకటి రెండో రోజుల్లో కేంద్ర పార్టీ వైపు నుంచి స్పందన ఉంటుందని, ఈ లోపు రాష్ట్ర, స్థానిక నేతలు ఠాక్రేకు గట్టిగా సమాధానం చెప్పాలని అమిత్ షా సూచించినట్లుగా చెబుతున్నారు… ఈ మధ్య కాలంలో ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు శృతి మించాయని కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం అభిప్రాయపడింది. సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతామని అంటోంది.