కాంగ్రెస్ లో ఒక వర్గం నిత్యం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటుంది. తాము చెప్పిందే వేదమని, ఇతరుల దాన్ని అనుసరించాల్సిందేనని వాదిస్తూ ఉంటుంది. అలాంటి గ్రూపు సోనియా, రాహుల్ పక్కన ఉంటూ ఇతరులపై డామినేషన్ చెలాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు రామమందిర వ్యవహారంలో కూడా ఆ ఒక్క గ్రూపు అదే విధంగా ప్రవర్తిస్తోంది. విశాల జనహితం, ప్రజల ఆకాంక్షలు, భారతీయతను వదిలి ఏదోదో మాట్లాడుతోంది.దానితో రామాలయ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది…
రామాలయ ప్రారంభోత్సవానికి సోనియాకు ఆహ్వానం
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , మారామమందిర ప్రతిష్ఠాపన జీ అధ్యక్షురాలు సోనియా గాంధీ , లోక్‌సభ నేత అధిర్ రంజన్ చౌదరిలను ఆహ్వానించారు. అయితే అయోధ్య వెళ్లే విషయంపై కాంగ్రెస్ ఆలోచనలో పడింది. ఆ పార్టీ నేతల్లో ధర్మసంకటం తప్పడం లేదు. సోనియా, ఖర్గే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పార్టీ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు. ఆహ్వానం అందకపోయినా రాముడు చూపిన మార్గంలో నడవాల్సిందేనని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. తమ రాష్ట్రంలో 90 శాతం జనాభా హిందువులని రాముడి పట్ల తమకు భక్తిభావం మెండుగా ఉందని ఆయన చెప్పుకున్నారు…
హిందీ రాష్ట్రాల్లో తీరని డైలమా…
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ ఈ సారి ఎన్నికల్లో కీలకమవుతాయి. అక్కడ 150కి పైగా లోక్ సభా స్థానాలున్నాయి. దానితో యూపీ నేతలు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అయోధ్య వెళ్లే విషయంలో యూపీ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ప్రారంభ కార్యక్రమం పెడుతున్నారని, అక్కడికి వెళితే బీజేపీ ట్రాప్ లో పడిపోతామని వాళ్లు వాదిస్తున్నారు. అయితే సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన పరిశీలనలో ఉన్న నేపధ్యంలో అలాంటి నిర్ణయం కూటమిని ఇబ్బందుల్లోకి నెట్టడమే అవుతుందని కొందరి వాదన. జనవరి 22న అయోధ్యకు వెళ్లాలని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు….
ఇతర నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు…
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కర్ణాటక కాంగ్రెస్ నేత డీ. సుధాకర్ వాదన వేరుగా ఉంది. కేవలం రాజకీయాల కోసమే మోదీ రామాలయాన్ని ప్రారంభిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య వాదన వేరుగా ఉంది. తాము రామాలయానికి వ్యతిరేకం కాదని సిద్దూ చెప్పుకుంటున్నారు. ఆలయ నిర్మాణానికి తాము అనుకూలమేనని ఆయన వాదన. కర్ణాటకలో 28 లోక్ సభా స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావాలంటే హిందువులను, హిందూవాదులను పగ చేసుకోకూడదని సిద్దరామయ్యకు తెలుసు. ఇతరులు మాత్రం వితండవాదానికి దిగుతున్నారు…