2 రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబు, పవన్ – తేల్చి చెప్పనున్న బీజేపీ ?

రెండు రోజుల్లో ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి ఎజెండా బీజేపీతో పొత్తులను ఫైనల్ చేసుకోవడమే. ఈ అంశంపై ఢిల్లీలో ఇప్పటికే అంతర్గత కసరత్తు పూర్తయిందని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే .. ఆ జాతీయ మీడియా చెప్పే దానికి భిన్నమైన రాజకీయం ఢిల్లీలో జరుగుతోందని తెలుస్తోంది.

ఏపీ బీజేపీ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే !

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఏపీ బీజేపీ ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ హైకమాండ్ కు చెందిన కీలక నేతలు పొత్తులపై అభిప్రాయసేకరణ జరిపారు. అదే సమయంలో వారు ఏపీలో పార్టీ ఎదగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. పార్టీకి ఏది మేలు అయితే ఆ నిర్ణయమే తీసుకుంటారని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి ఏపీ బీజేపీ నేతలంతా స్వాగతించారు.

పొత్తులపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్

పొత్తులపై హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఏపీ బీజేపీ ముఖ్యనేతలంతా చెబుతున్నారు. అయితే బీజేపీని చులకన చేసేలా కొన్ని పార్టీలు ఏపీలో చేస్తున్న ప్రచారాన్ని మాత్రం కొంత మంది నేతలు తిప్పి కొడుతున్నారు. వారిపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పొత్తుల పేరుతో బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సహించే ప్రశ్నే లేదని హైకమాండ్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో ఘాటైన హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉంది.

గౌరవప్రదమైన పొత్తులు ఖాయం !

ఢిల్లీ రాజకీయాల కోసం ఏపీ బీజేపీ ని తక్కువ చేసే రాజకీయాలు అసలు ఉండవని.. ఈ సారి బీజేపీని బలోపేతం చేసే దిశగానే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే బలమైన నేతలను.. తమ తమ నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని హైకమాండ్ సూచించింది. హిందూపురంలో విష్ణువర్ధన్ రెడ్డి చాలా కాలంగా కష్టపడుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలందరికీ.. గౌరవంగా పొత్తులు ఉంటాయని భావిస్తున్నారు.