కాంగ్రెస్ ను చించేసిన అమిత్ షా..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మితభాషి. ఆయన కేవలం వ్యూహకర్తలా మాత్రమే కనిపిస్తారు. సర్దార్ పటేల్ తర్వాత అంతటి శక్తిమంతమైన నాయకుడని జాతియావత్తు గుర్తించింది. అలాగని నిజంగా ఆయన నిత్యం మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటే. ఓ సారి ఆయన మాట్లాడటం మొదలుపెట్టారంటే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆయన ప్రతీ మాటలోనూ వాస్తవికత ఉట్టిపడుతుంది. బీజేపీ దేశానికి చేస్తున్న సేవలు, కాంగ్రెస్ నేతృత్వ ఇండియా గ్రూపులోని సరిదిద్దుకోలేని లోపాలను ఆయన ఒకటొకటిగా బయట పెడుతుంటారు.

కాంగ్రెస్ వారసత్వంపైనే సమరం….

ఎన్నికలు వంద రోజుల కంటే తక్కువ సమయం ఉన్న వేళ.. ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల బీజేపీ జాతీయ సమ్మేళనం జరిగింది. ముగింపు సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా… కాంగ్రెస్ పార్టీపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇండియా గ్రూపు ఒక వారసత్వ రాజకీయ కూటమి అని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ సకాలంలో అధికారానికి రాకపోతే కాంగ్రెస్ పార్టీ అవినీతికర రాజకీయాలు ఇంకా కొనసాగి ఉండేవని అమిత్ షా గుర్తుచేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నాణెనికి రెండు వైపుల లాంటివని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా గ్రూపులో ఏడు వారసత్వ పార్టీలు ఉన్నాయని ఆయన అన్నారు. అమిత్ షా పరోక్షంగా కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ ను కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో వారసత్వ రాజకీయాలు తారా స్థాయికి చేరాయన్నారు…

అన్ని అవలక్షణాలున్న పార్టీ….

బీజేపీ సమావేశంలో చేసిన తీర్మానంలో కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్వేషాలు రెచ్చగొట్టడం, కుట్ర పూరిత చర్యలకు దిగడం, అవినీతి ప్రోత్సహించడం లాంటివి దేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాయన్నారు. దేశంలో అరాచకాన్ని వ్యాపింపజేయడమే ఇండియా గ్రూపు లక్ష్యమని, జనంలో విభేదాలు సృష్టించి లబ్ధి పొందే ఉద్దేశంతో ఆ పార్టీలు పనిచేస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు.

అన్ని చోట్ల బీజేపీనే టార్గెట్…

ఇండియా గ్రూపుకు దేశంలో అన్ని చోట్ల బీజేపీ మాత్రమే టార్గెట్ అవుతోందని ఓ తీర్మానంలో ఆరోపించారు. సందేశ్ ఖలీలో హింసాకాండను బీజేపీ తీవ్ర స్వరంతో ఖండించింది. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీపై కక్షసాధింపు కోసం సందేశ్ ఖలీలో ఆదివాసీలను బలిచేసిందని వ్యాఖ్యానించారు. ప్రజావాక్కును అణచివేయడమే తృణమూల్ ధ్యేయమన్నారు. కేరళలో సీపీఎం, సీపీఐ భాగస్వాములందరూ కలిసి బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారన్నారు. ఇండియా గ్రూప్ ఇప్పుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. ఎవరెన్ని చేసినా ప్రజల్లో మోదీకి ఉన్న పరపతిని చెరిపెయ్యలేదన్నారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతిని ఓ తీర్మానంలో ప్రస్తావించారు…