చంద్రముఖి సినిమా క్రియేట్ చేసిన సన్షేషన్ అంతా ఇంతా కాదు. దానికి సీక్వెల్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రజనీకాంత్ , జ్యోతిక లేరు..ఆ ప్లేస్ లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్,సాంగ్స్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ క్రేజ్ ని కంటిన్యూ చేయగలదా అనే టాక్ వినిపిస్తోంది..
ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు భారీగా ఉంటాయి. మాతృకని మించి ఉంటుందని ముందే ఫిక్సైపోతారు. సరికొత్త కథ, కథనాలు, అబ్బుర పరిచే పాత్రలు, ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుందనే భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సీక్వెల్స్‌ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. అలాంటి ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ లో చంద్రముఖి ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘చంద్రముఖి’. మలయాళ బ్లాక్ బస్టర్ ‘మణిచిత్రతాళ్’ ఆధారంగా పి.వాసు రీమేక్ చేసిన మూవీ ఇది. జ్యోతిక టైటిల్ పాత్రలో నటించగా శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటుడు ప్రభు, అతని సోదరుడు రామ్ కుమార్ గణేషన్ సంయుక్తంగా నిర్మించారు. వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రజనీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో రజనీ మేనరిజమ్స్,స్టైల్స్ ఒకెత్తయితే కళ్లతో అద్భుతాభినయాన్ని కనబరిచి భయపెట్టిన జ్యోతిక నటన మరో ఎత్తు. అలాంటి పాత్ర మళ్లీ తెరపైకి వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలి.
దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత చంద్రముకి సీక్వెల్ ని లైకా ప్రొడక్షన్స్ వారు తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇందులో రజనీకాంత్, జ్యోతిక లేరు. ఆప్లేస్ లో రాఘవ లారెన్స్, కంగన రౌత్ నటించారు. పి. వాసు డైరెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకునేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలక పాత్రల్లో రజనీకాంత్, జ్యోతికను చూసినవారంతా ఆ ప్లేస్ లో రాఘవ లారెన్స్, కంగనాను చూడగలరా అన్నదే ప్రశ్న. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘స్వాగతాంజలి’ అంటూ సాగే ఓ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ సాంగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రముఖి పాత్రలో కంగన ఏం చేసినా జ్యోతికతో పోల్చి చూస్తున్నారు. వారాయ్ అంటూ కళ్లతో భయపెట్టిన జ్యోతికను కంగనా మరపించగలదా అనే డిస్కషన్ జరుగుతోంది. తమిళంతో పాటు తెలుగు ,మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో ఈ సినిమాను ‘వినాయక చవితి’ సందర్భంగా విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ….