రాజ్ ఠాక్రే రాకతో బీజేపీ మాస్టర్ స్ట్రోక్….

మిషన్ 400 సాకారం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భావసారూప్యత ఉన్న వారిని చేర్చుకునేందుకు వెనుకాడటం లేదు. వచ్చే వారికి సముచిత స్థానం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఇప్పుడు బీజేపీతో మైత్రికి ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయేను బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు…..

అమిత్ షాతో రాజ్ ఠాక్రే భేటీ…

ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే రెండు రోజుల క్రితం అమిత్ షా తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ఎన్డీయేలో చేరేందుకు ఉత్సాహం చూపినట్లుగా తెలుస్తోంది. రాజ్ ఠాక్రే, అమిత్ షా భేటీ వెనుక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రాంగం ఉందని తెలుస్తోంది. అజెండా విషయంలో ఫడ్నవీస్ గోప్యత పాటిస్తున్నప్పటికీ, చర్చలు పురోగమిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ ఠాక్రే తమకు చిరకాల మిత్రుడవుతారని, రెండు పార్టీల విధానం ఒక్కటేనని ఆయన అంటున్నారు.

లోక్ సభా ? అసెంబ్లీ ఎన్నికలా…??

శివసేన ప్రస్తుత చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ కజిన్ అవుతారు. బాల్ ఠాక్రే హయాంలో ఇద్దరు కలిసి పనిచేశారు.పార్టీలో ఎవరు నెంబర్ టూ అన్న చర్చ కూడా ఉండేది. 2006లో ఉద్ధవ్ తో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడున్న నేతగా రాజ్ ఠాక్రేకు పేరు ఉంది.విడిపోయిన తొలి నాళ్లలో రాజకీయాల్లో బాగానే రాణించినా ఇప్పుడు కొంత డీలా పడిన మాట వాస్తవం.ప్రస్తుతం ఆయన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే రాజకీయ ప్రయోజనం కంటే దేశాభివృద్ధి, సంక్షేమం కోసమే రాజ్ ఠాక్రే, ఎన్డీయే వైపుకు వస్తున్నారని ఎంఎన్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేసి..భారతను మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే తమ ధ్యేయమని రాజ్ ఠాక్రే అంటున్నారు. బేషరతుగా ఆయన ఎన్డీయే వైపుకు వస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్డీయేలో ఎంఎన్ఎస్ కు ముంబైలో ఒక ఎంపీ స్థానం కేటాయించే అవకాశం ఉంది. అయితే అది కూడా ఉండకపోవచ్చని ప్రస్తుతానికి రాజ్ ఠాక్రేను ప్రచారానికి ఉపయోగించుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సముచిత రీతిన సత్కరించి..ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తామని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకు రాజ్ ఠాక్రే సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది…

లబోదిబోమంటున్న ఉద్ధవ్…

శివసేన ఇప్పటికే రెండు ముక్కలైంది. బలమైన వర్గాన్ని తీసుకుని బీజేపీతో జతకట్టిన ఏక్ నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్దవ్ ఠాక్రే ఓ బలహీనమైన వర్గానికి నాయకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ ఠాక్రే కూడా బీజేపీతో జతకడుతున్నారని తెలుసుకుని ఉద్దవ్ టెన్షన్ పడుతున్నారు. ఠాక్రే పేరు లేకుండా బీజేపీ మనుగడ సాగించలేదని ఆయన అర్థం లేని వాదనను తెరమీదకు తెచ్చారు. ఉద్ధవ్ మాటలు విని మహారాష్ట్ర జనం నవ్వుకుంటున్నారు.