బీజేడీ పాలనపై బీజేపీ అనుమానాలు – పొత్తుకు దూరం…

ఒడిశాలో రాజకీయ శక్తుల పునరేకీరకరణ జరుగుతుందని భావించారు. బీజేపీ, బీజేడీ పొత్తు కుదిరి లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పంచుకుంటాయని ఎదురుచూశారు.ఒక దశలో చర్చలు సక్సెస్ అవుతాయని కూడా లెక్కలేసుకున్నారు. ఐనా చివరకు కటీఫ్ అనుకోవడమే మిగిలింది. పొత్తు లేదు, గిత్తు లేదు.. ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ స్వయంగా ప్రకటించింది…

వ్యతిరేకించిన బీజేపీ ఒడిశా శాఖ…

పొత్తు చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాల విషయంలో బీజేపీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యింది. బీజేడీ డిమాండ్లు సహేతుకంగా లేవని అటు ఒడిశా నేతలు, ఇటు అధిష్టానం ప్రతినిధులు వాపోయారు. తాము ఎంత తగ్గినా, బీజేడీ తగ్గేందుకు సిద్ధంగా లేదని వారు నిర్థారణకు వచ్చారు. దానితో పొత్తు వద్దులే, కేంద్రంలో మోదీ సర్కారుకు సహకరించినందుకు సంతోషంగా ఉందని ఒక స్టేట్ మెంట్ పడేసి గుడ్ బై చెప్పేశారు. పైగా పొత్తుకు బీజేపీ ఒడిశా నేతలు తొలి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో జాతీయ పార్టీకి నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు.బీజేపీ నేతలు డామినేట్ చేసే అవకాశం ఉందని అధిష్టానం వద్ద వాదించారు. అనవసర వివాదాలకు ఒడిశా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు..

ప్రజలకు అందని కేంద్ర పథకాలు…

కేంద్ర పథకాల విషయంలో కూడా బీజేపీకి ఒక నివేదిక అందింది. పథకాలకు సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో జనానికి పంచకుండా బీజేడీ ప్రభుత్వం పక్కతోవ పట్టిస్తోందని అభిప్రాయపడింది.పదేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా.. తాము వాటిని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఒడిశా బీజేపీ చీఫ్ మన్మోహన్ సామల్ ఆరోపించారు. ఒడిశా ప్రజల ఆత్మగౌవరం, వారి ప్రయోజనాలు కాపాడటంతో బీజేడీ ఏ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన ఆరోపిస్తూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఒడిశా బీజేపీ నేతల మనోగతాన్ని ఆయన ఆవిష్కరించారు.

పాండ్యన్ అడ్డుపడ్డారా…?

మాజీ బ్యూరోక్రాట్, ఇటీవలే బీజేడీలో చేరిన సీఎం నవీన్ పట్నాయక్ సన్నిహితుడు పాండ్యన్ ఈ పొత్తు పొడవకుండా అడ్డుపడ్డారని కూడా ఓ వైపు నుంచి వార్తలు వస్తున్నాయి. బీజేపీతో స్నేహం ఆయనకు ఇష్టం లేదని చర్చ జరుగుతుంది. బీజేపీతో కలిస్తే తన డామినేషన్ పోతుందని పాండ్యన్ భయపడ్డారు.దానితో చర్చలకు వచ్చే బీజేపీ నేతల పట్ల ఆయన నిర్లక్ష్యం ధోరణిని ప్రదర్శించారు. మీరెంత, మీ పార్టీ ఎంత అన్న తీరులో ఆయన మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే పొత్తు వద్దనుకున్న బీజేపీ నేతలు పూర్తి జగన్నాథ్ స్వామి ఆశీస్సులతో విజయ తీరాలకు చేరతామని చెప్పుకుంటున్నారు..