ఉత్తర ప్రదేశ్ బీజేపీకి ఆయువు పట్టు లాంటి రాష్ట్రం. వరుసగా రెండు సార్లు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన ఘనత కూడా ఆ పార్టీకి దక్కుతుంది. అతి పెద్ద రాష్ట్రం, అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాన్ని యూపీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. తలసరి ఆాదాయం అక్కడ గణనీయంగా పెరిగింది. బీజేపీ పాలన పట్ల యూపీలో ముస్లింలు కూడా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. మళ్లీ మళ్లీ ఆయనకే ఓటు వేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలపై యూపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఓబీసీ ఓట్లే కీలకం
యూపీలో ఓబీసీలే ఎక్కువగా ఉంటారు. వారిని ఆకట్టుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రెండవ వర్థంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కల్యాణ్ సింగ్ వర్థంతిని హిందూ గౌరవ్ దివస్ గా పాటించారు. కల్యాణ్ సింగ్ దయాగుణం ఉన్న నాయకుడని అమిత్ షా ప్రశంసించారు. పేద, అల్పాదాయ వర్గాలకు సమాజంలో వివక్షకు గురైన వారికి కల్యాణ్ సింగ్ అండగా నిలిచారన్నారు. పేదలను ఆదుకోవడమే ఆయన ధ్యేయమన్నారు. కల్యాణ్ సింగ్ ను బాబూజీగా సంబోధించిన అమిత్ షా.. ఆయన వర్థంతిని హిందూ గౌరవ్ దివస్ గా ఇకపై ప్రతీ సంవత్సరం నిర్వహిస్తామన్నారు. హిందూత్వవాదిగా అందరినీ కలుపుకుపోయిన కల్యాణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ ప్రజలకు ఆదర్శ నాయకుడని యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగించారు.
సామాజిక వర్గాల సమీకరణే లక్ష్యం
యూపీలోని అన్ని 80 లోక్ సభా స్థానాలను సాధించాలంటే ఓబీసీలను ఏకమత్యంగా ఉంచుతూ తమవైపుకు తిప్పుకోవడం అనివార్యమని బీజేపీకి తెలుసు. అనేకానేక ససమ్యలతో విడిపోయి ఉన్న ఓబీసీలను కల్యాణి సింగ్ వర్థంతి సాక్షిగా ఏకం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు బీజేపీ చెప్పుకుంటోంది. ఓబీసీల వెనుకబాటుతనం వారి సమస్యలు తమకు తెలుసునని ఆ దిశగా ఓ కార్యాచరణ త్వరలోనే అమలవుతుందని అమిత్ షా అంటున్నాు. కల్యాణ్ సింగు కులవాది కాదని ఓబీసీల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన పనిచేశారని బీజేపీ వాదిస్తోంది. ఆయన బాటలో నడుస్తూ వెనుకబడిన,అణగారిన వర్గాలను మోదీ పైకి తీసుకొస్తున్నందునే ఇప్పుడు దేశ ప్రజలు మొత్తం ప్రధానికి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ పెద్దలు వాదిస్తున్నారు.
కల్యాణ్ కలలుగన్న రామాలయం
రామాలయ ఉద్యమంలో కల్యాణ్ సింగ్ కీలకపాత్ర పోషించారు. అందుకోసం హిందూ సంస్థలన్నింటినీ ఏకం చేశారు. దాని వల్ల ఆయన పదవి కూడా పోయింది . మాజీ ముఖ్యమంత్రిగా మారాల్సి వచ్చింది. ఐనా ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో వచ్చే ఏడాది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది. కల్యాణ్ సింగ్ చొరవ, ఆకాంక్షల వల్లే రామాలయం సాధ్యమవుతోందని బీజేపీ అంటోంది.