అక్కడ నాలుగో సారి విజయం దిశగా బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజెపీ) ప్రతీ నియోజకవర్గాన్ని తనదిగా భావిస్తూ అభివృద్ధి చేస్తుంది. అక్కడ క్షేత్రస్థాయి, పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచుకుంటుంది. వారి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంది. దానితో నియోజకవర్గం శాశ్వతంగా వారి ఖతాలో పడిపోతుంది. గుజరాత్లోని సబర్కాంతా నియోజకవర్గం కూడా అలాంటిదేనని చెప్పాలి…

శోభనా భరయ్యాకు టికెట్…

గుజరాత్లోని 26 లోక్ సభా నియోజకవర్గాల్లో సబర్కాంతా కూడా ఒకటి. అందులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఆరింట బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఆరావలీ జిల్లాలో ఉన్న సబర్కాంతాలో బీజేపీ ఇప్పటికే వరుసగా మూడు సార్లు గెలిచింది. ప్రస్తుతం దీప్ సింహ్ శంకర్ సింహ్ రాథోడ్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఈ సారి భికాజీ దామోర్ అనే నాయకుడికి టికెట్ ప్రకటించినప్పటికీ..అతని సామాజికవర్గంపై వివాదం రేగడంతో తాజాగా శోభనా భరయ్యాను రంగంలోకి దించారు. ఆమె బలమైన ఠాకోర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.

అమిత్ షా నాయకత్వమే బలం…

శోభనా భరయ్యా తొలుత ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ఆమె భర్త మహేంద్ర సింగ్ భరయ్యా.. ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి.. తర్వాత తన సేవా కార్యక్రమాల ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. శోభనా భరయ్యాకు టికెట్ ఇవ్వడంపై ఒకరిద్దరు స్థానిక నేతలు అలిగినప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి వారిని దారికి తెచ్చారు. అభ్యర్థి ముఖ్యం కాదని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని ఇప్పుడు సబర్కాంతాలోని బీజేపీ కార్యకర్తలంతా చెబుతున్నారు. గుజరాత్ ప్రజలకు మోదీనే ఆరాధ్య నాయకుడని అంగీకరిస్తున్నారు..

భరయ్యా ఇంటింటి ప్రచారం…

రాజకీయాలకు కొత్త అయినప్పటికీ శోభనా భరయ్యా.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్ద బహిరంగ సభలను చాలా వరకు తగ్గించి.. ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఓటర్లతో కనెక్ట్ అవుతున్నారు. మోదీ సాధించిన భారత ప్రగతిని చూసి ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం తగ్గిందని, పేదలందరికీ రేషన్ అందుతోందని ఆమె గుర్తు చేస్తున్నారు. తాగు నీరు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయిందని చెబుతున్నారు. జాతీయ ప్రధానాంశాలే కాకుండా స్థానిక సమస్యలపై కూడా బీజేపీ దృష్టి పెడుతోందని చెబుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో బాగా వెనుకబడిపోయింది. ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. రాహుల్ గాంధీ ఒక సారి వచ్చి వెళ్లినా కాంగ్రెస్ ప్రచారం ఊపందుకోలేదు. అందుకే మే 7న జరిగే పోలింగ్ లో తాము సునాయాసంగా గెలుస్తామని బీజేపీ చెబుతోంది…