90 శాతం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఎన్నికల ప్రక్రియలో బీజేపీ అందరికంటే ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతుంటే…బీజేపీ వరుస జాబితాలతో ప్రకటనలు చేస్తోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడంలో కూడా తనదైన వేగాన్ని ప్రదర్శిస్తోంది. విజయావకాశాలు లేని వారిని పక్కన పెట్టేయడంలో ఎలాంటి మొహమాటాలు పాటించడం లేదు. వారిని వేరొక విధంగా అకామడేట్ చేయాలన్న ఆలోచనతో బీజేపీ సంకేతాలు కూడా పంపిస్తున్నట్లు సమాచారం….

దాదాపు 440 చోట్ల పోటీ…

బీజేపీ మిషన్ 400 దిశగా పరుగులు తీస్తోంది. అంటే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 స్థానాలు రావాలన్నది ఆ పార్టీ ఆకాంక్షగా చెప్పుకోవాలి. బీజేపీకి విడిగా 370 స్థానాలు, మిత్రపక్షాలకు కనిష్టంగా 30 స్థానాలు రావాలని బీజేపీ సంకల్పించింది. ఆ క్రమంలోనే 440 లోక్ సభా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. తొలి దశ పోలింగ్ కు నాలుగు వారాల ముందే 402 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. త్వరలోనే మిగతా 38 సీట్ల అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. పోటీ చేసే ప్రతీ అభ్యర్థికి కనీసం నెల రోజుల ప్రచార సమయం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది…

100 మంది సిట్టింగులకు నో టికెట్…

విజయావకాశాలు లేనివారిని దూరం పెట్టడమే కరెక్టు మార్గమని బీజేపీ ముందుగానే డిసైడైంది. ఆ క్రమంలోనే వంద మంది ఎంపీలకు టికెట్లివ్వలేదు. అందులో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఘజియాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే జనరల్ వీకే సింగ్, బక్సార్ ప్రతినిధి అశ్వినీ ఛౌబే, న్యూఢిల్లీ ప్రతినిధి మినాక్షీ లేఖీ లాంటి వారికి ఈ సారి విశ్రాంతినిచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ పరువు తీసిన సాధ్వీ ప్రాగ్యా ఠాకూర్, రమేష్ బిధూరి,పర్వేష్ వర్మ లాంటి వారు ఈ సారి ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రతీ అభ్యర్థి ఒక కమలం అని ఇటీవలే ప్రకటించిన ప్రధాని మోదీ.. వికసించే కమలాలకే పోటీ చేసే అవకాశం కల్పించారు.

పొత్తులతో మరింత బలం…

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వ తెలుగుదేశం పార్టీని బీజేపీ మళ్లీ ఎన్డీయేలోకి ఆహ్వానించింది. పవన్ కల్యాణ్ అప్పటికే ఎన్డీయేలో ఉన్నారు. ఏపీలో పోటీ చేయబోతున్న ఆరు స్థానాల్లో గెలిచి తీరాలని బీజేపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో ఏపీలో దెబ్బతిన్న సంగతి బీజేపీకి బాగానే గుర్తు ఉంది. ఒడిశాలో బీజేడీతో పొత్తు కుదరకపోయినా బీజేపీకి పెద్దగా ఆందోళన లేదు. పూరీ నుంచి సంబిత్ పాత్ర, భువనేశ్వర్ నుంచి అపరజితా సారంగీని పోటీ చేయించాలనుకుంటే.. ఆ రెండు స్థానాలను వదులుకునేందుకు బీజేడీ ఇష్టపడలేదు. ఎవరి మద్దతు లేకుండా వాళ్లిద్దరు గెలుస్తారనుకున్న తరుణంలో బీజేడీని దూరం పెట్టేందుకు సైతం బీజేపీ వెనుకాడలేదు. పంజాబ్ లో అకాలీదళ్ తో సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. జూన్ 1న పంజాబ్ పోలింగ్ ఉండటంతో ఆ అక్కడ బీజేపీ తొందరపడ దలచుకోలేదు…