కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. గ్రూపు 23లో సభ్యుడైన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి దూరం జరిగారు. డెమోక్రాటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) స్థాపించిన గులాం నబీ ఇప్పుడు సొంత రాజకీయాలు చేస్తున్నారు. కశ్మీర్లోనూ, దేశంలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత మనోభావాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ముస్లింలు ఎలా వచ్చేరనేదానిపై ఆయన తనదైన, వాస్తవమైన దృక్కోణాన్ని ఆవిష్కరించారు..
మత మార్పిడితోనే ముస్లింలయ్యారు..
ఎక్కువమంది మత మార్పిడితోనే ముస్లింలు అయ్యారని గులాం నబీ గుర్తు చేశారు. కశ్మీర్ లోయే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోకూడదని ఆయన ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వ్యక్తి బలహీనుడై ఉంటాడని అంటున్నారు.
“ముస్లింలు బయట నుంచి వచ్చారని కొందరు అంటుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్లు ఎవరూ ఇక్కడ లేదు. ఇస్లాం కేవలం 1,500 సంవత్సరాల క్రితం తెరపైకి వచ్చింది. హిందూ మతం చాలా ప్రాచీనమైనది. ముస్లింలలో కేవలం పది పన్నెండు మంది బయట నుంచి వచ్చి ఉండొచ్చు. కొందరు మొఘల్ ఆర్మీలో కూడా పనిచేశారు. చాలామంది ఇక్కడి వారే. మత మార్పిడి జరిగిన వారే. కశ్మీర్లో ఈ ఉదాహరణలు కనిపిస్తాయి. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ముస్లింలు లేరు. అంతా కశ్మీర్ పండిట్లే ఉండేవారు. వాళ్లంతా ఇస్లాంలోకి మారారు. అంతే.. ” అని గులాం నబీ ఆజాద్ విశ్లేషించారు.
మరణంలోనూ దేశ సేవ
హిందూ, ముస్లింలు ఇద్దరూ దేశం పట్ల ప్రేవ ఉన్న వ్యక్తులేనని ఆజాద్ అంటున్నారు. చనిపోయిన హిందువుల్లో కొందరిని ఖననం చేస్తారని , ముస్లింలు కూడా అంతేనని ఆయన గుర్తు చేశారు. వారి దేహం, వారి ఎముకలు ఈ దేశ ఖనిజ సంపదగా మారుతోందని అన్నారు. హిందువుల అస్తికలు నదుల్లో కలిపితే ఆ నీళ్లు పవిత్రమవుతాయన్నారు. ఈ సంగతిని పక్కన పెట్టి కొందరు నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఆజాద్ వ్యాఖ్యలకు బీజేపీ మద్దతు
బీజేపీ సీనియర్ నేత కవితా గుప్తా ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. మన దేశంపై దండయాత్రలకు ముందు అందరూ హిందూ మతస్థులేనన్నారు. ఆజాద్ ఇచ్చిన టైమ్ లైన్ నూటికి నూరు పాళ్లు నిజమేనన్నారు. కొందరి వల్లే మతానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. అయితే పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ మాత్రం ఆజాద్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ పూర్వీకులపై చరిత్రపై ఆయనకు అవగాహన ఉందా లేదా తెలుసుకోవాలన్నారు. ఆదిమానవుల టైమ్ వరకు ఆయన వెళ్లగలరా అని ప్రశ్నించారు.