మనదేశంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాలు!

ఏప్రిల్ 23 హనుమాన్ విజయోత్సవం. ఊరికో రామాలయం ఉన్నట్టే హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. ఆంజనేయుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన హనుమాన్ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

శ్రీ బాల హనుమాన్ దేవాలయం – ఢిల్లీ కన్నాట్
ఢిల్లీ లో కనౌట్ లో ప్రసిద్ధి చెందిన శ్రీ బాల హనుమాన్ దేవాలయం ఉంది. ఇది మహాభారత కాలంలోని ఐదు దేవాలయాలలో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ హనుమంతుడు దక్షిణ ముఖం ఉండటం వల్ల ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. గంధ సింధూరం పూతతో, ధగధగతో, మెడలో పుష్పమాలలతో శ్రీ హనుమాన్ దర్శనమిస్తాడు.

సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం – వారణాసి
ఉత్తర ప్రదేశ్ వారణాసిలో ఉన్న ఈ దేవాలయాన్ని తులసీదాస్ స్థాపించినట్లు చెబుతారు.ఈ దేవాలయం ఆధ్యాత్మిక ఆశ్రయంగా విరాజిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

జఖు దేవాలయం – హిమాచల్ ప్రదేశ్
సిమ్లాలోని ఎత్తైన జఖు కొండపై ఉన్న ఈ ఆలయం ఉంది. రామ రావణ యుద్ధం సమంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మ అస్త్రానికి లక్ష్మణుడు మూర్చపోయాడు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన ఆంజనేయుడు తిరిగి అక్కడ పెట్టేందుకు వెళ్లే మార్గ మధ్యలో కొంతకాలం జఖు కొండపై విశ్రాంతి తీసుకున్నాడట. హనుమంతుడి బరువు వల్ల కొండ శిఖరం చదును అయిందని చెబుతారు. హనుమంతుని పాదముద్రలు ఉన్న ప్రదేశం చుట్టూ ఆలయం నిర్మించారు.

మహావీర్ మందిర్ – పాట్నా
ఉత్తర భారత దేశంలో పున్పున్ నది ఒడ్డున ఉన్న జల్లా హనుమాన్ ఆలయ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. కాశ్మీర్‌లోని వైష్ణో దేవి తర్వాత ఉత్తర భారతదేశంలో అత్యధికంగా సందర్శించే రెండవ పుణ్యక్షేత్రం ఇదే. ఈ దేవాలయంలో హనుమంతుడుతో పాటు వినాయకుడు ఉంటారు.

శ్రీ హనుమాన్ మందిర్ – సారంగపూర్
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి భావనగర్ వెళ్లే దారిలో సారంగ్ పూర్ అనే ప్రాంతంలో ఉంది శ్రీ హనుమాన్ మందిరం . ఈ ఆలయాన్ని ఎక్కువగాక్షుద్ర పూజలతో ఇబ్బంది పడేవారు దర్శించుకుంటారు.

బాల హనుమాన్ దేవాలయం – జామ్‌నగర్
గుజరాత్‌లోని జామ్‌నగర్‌ లఖోటా సరస్సుకి ఆగ్నేయ వైపున ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ 1963లో స్థాపించారు. ఆగస్ట్ 1, 1964 నుండి నిరంతరంగా ‘రామ నామం’ జపించడం వలన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

బడే హనుమాన్ ఆలయం – సంగం
ప్రయాగ్‌రాజ్ కోటకు ఉత్తరాన 500 మీటర్ల దూరంలో బడే హనుమాన్ జీ ఆలయంలో హనుమాన్ విగ్రహం శయన భంగిమలో ఉంటుంది. 20 అడుగులు పొడవు 8 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఇక్కడ విగ్రహం సగ భాగం నీటిలో ఉంటుంది.

నమక్కల్ ఆంజనేయ ఆలయం – తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశంలో లక్ష్మీదేవి తపస్సు చేసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు.

హనుమాన్‌గర్హి – అయోధ్య
సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు 76 మెట్లు ఎక్కాలి. తులసీదాస్ హనుమాన్ చాలీసాలో “రామ్ దువారే తుమ్ రఖవారే, హోతా న ఆగ్య బిను పైసారే” అని వ్రాశారు. అంటే శ్రీరాముని దర్శనానికి ముందు, మీరు హనుమాన్ జీ నుండి అనుమతి తీసుకోవాలి.

పంచముఖి హనుమాన్ దేవాలయం – తమిళనాడు
తమిళనాడులో కుంభకోణం లో40 అడుగుల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడ స్వామిఆకుపచ్చ రంగు తో స్వామి కనిపిస్తాడు .ఈ ఆలయం రామాయణ కాలం నుండి ఉందని నమ్ముతారు

మెహందీపూర్ బాలాజీ దేవాలయం – రాజస్థాన్
రాజస్థాన్ లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ ఆలయం. అవడానికి చాలా చిన్న ఆలయమే… మహిమలు అమోఘం. దుష్టశక్తులతో బాధలు పడేవారికి ఈ ఆలయమే శరణ్యం అంటారు.

సలాసర్ హనుమాన్ మందిర్ – సలాసర్
రాజస్థాన్‌లోని సలాసర్ పట్టణం నడిబొడ్డున ఉంది. మీసాలు మరియు గడ్డం ఉన్న హనుమంతుని ఏకైక ఆలయం ఇది అని చెబుతారు. ఏడాది పొడవునా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.