ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ నెలకొంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీలే అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో వైసిపికి ఉన్న ఊపు ఇప్పుడు లేదు. తెలుగుదేశం ఇతర పార్టీలు కూటమిగా జతకట్టడంతో కొంత బలం పెరిగింది. అభ్యర్థులు స్థానికంగా ఉండే పరిచయాలు, ఆర్థిక సంబంధాలు, సేవా కార్యక్రమాలతోనే ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు.
ఎంపీ బరిలో హోరాహోరీ
వైసిపి, తెలుగుదేశం అభ్యర్ధులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి..మొన్నటివరకూ వైసిపిలోనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. గెలుపు కోసం కుస్తీలు పడుతున్నారు. భాస్కరరెడ్డి తిరుపతి జిల్లా నుండి వలస వచ్చారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. చెవిరెడ్డిని ఇక్కడ పోటీలో దింపడం వ్యూహాత్మకమే. చెవిరెడ్డి మండల కేంద్రాల్లో పరిచయ వేదికల పేరుతో భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేయడం హైలైట్‌గా నిలిచింది. అసెంబ్లీ అభ్యర్థులకు ఆయనే తెరచాటున అన్ని విధాలా చూసుకుంటున్నారనే చర్చ ఉంది. ప్రచారం కన్నా సమీకరణలు పెంచుకునేందుకు జరుగుతున్న భేటీలే కీలకంగా మారాయి.
పరిచయాలతో మాగుంట ప్రయత్నం
మాగుంట… తన కుటుంబం రాజకీయ నేపథ్యం రీత్యా గెలుపు కోసం అన్ని వ్యూహాలూ పన్నుతున్నారు. పశ్చిమాన తన సామాజికవర్గం నుంచి ఓటు వస్తుందనే ధీమాలో ఉన్నారు. చెవిరెడ్డిపై పట్టు సాధిస్తామనే ఆశాభావంలో ఉన్నారు. మాగుంటతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఎక్కువ పశ్చిమప్రాంతంలో దృష్టి సారించారు. కొన్నిచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మాగుంటే ఇప్పుడు నడిపించాల్సి వచ్చింది. తూర్పు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్దులకు, పశ్చిమాన వైసిపి అభ్యర్దులకు ఎడ్జ్ ఉందనే చర్చ నడుస్తోంది. జనసేన పొత్తు వల్ల ఆ సామాజికవర్గం ఓటర్లతో పాటు నేతలు కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం వైపు చేరుతున్నారు. ఒంగోలు పట్టణంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
గట్టీ పోటీ ఎదుర్కొంటున్న వైసీపీ అభ్యర్థులు
గిద్దలూరులో…80 వేల మెజారిటీ వచ్చిన అన్నా రాంబాబును కూడా మార్కాపురం మార్చారు. మంత్రి ఆదిమూలం సురేష్‌ను యర్రగొండపాలెం నుండి కొండపికి మార్చారు. ఇలా జరిగిన కొన్ని బదిలీల వల్ల అసంతృప్తులు కొంత తగ్గి గట్టిపోటీ అనే స్థాయికి వచ్చింది. ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మంత్రి మేరుగ నాగార్జున ఇద్దరూ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఒంగోలులోనూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది. ఇప్పటికి ముగ్గురు కార్పొరేటర్లు వైసిపిని వీడారు. చేరికలు వ్యూహాత్మకంగానే నడుస్తున్నాయి.