రాయ్ బరేలీ పారిపోయిన రాహుల్…

రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రధాని మోదీ ఇస్తున్న షాకులు, దమ్ముంటే అమేఠీలో పోటీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేస్తున్న సవాళ్లు కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.పైగా నేను సైతం అంటూ ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాధ్రా పోటీ చేస్తానని ప్రకటించడంతో కుటుంబ కలహం బయటపడి గ్రాండ్ ఓల్డ్ పార్టీ నానా తంటాలు పడుతోంది.

వయనాడ్ పోలింగ్ ముగిసే వరకు ఆగి….

రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లో పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ చాలా రోజులు కొనసాగింది.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో ఆయన తొలుత నామినేషన్ వేశారు. అక్కడ పోలింగ్ పూర్తయిన తర్వాతనే యూపీపై దృష్టిపెట్టారు. అయితే యూపీలో నామినేషన్లు వేసేందుకు ఆఖరి రోజయిన ఇవ్వాల్టి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని సస్పెన్స్ లోనే ఉంచింది. గాంధీ కుటుంబానికి అత్యంత ఇష్టమైన అమేఠీ, రాయ్ బరేలీ మళ్లీ పోటీ చేస్తారా అనే సస్పెన్స్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠకు కూడా దారితీసింది. సోనియాగాంధీ రాయ్ బరేలీ వదిలేసి రాజ్యసభకు వెళ్లిపోవడంతో అక్కడెవరు పోటీచేస్తారన్న చర్చ ఊపందుకుంది. దీనిపై బీజేపీ విపరీతమైన సెటైర్లు వదిలింది. నిర్ణయాలు అంత జాప్యమవుతున్నాయేమిటని జోకులేసింది. భయపడుతున్నారని కవ్వించింది.

ప్రియాంకా కాదు, రాబర్ట్ వాధ్రా కాదు..రాహులే….

నామినేషన్ల చివరి రోజున అసలు సంగతి బయటపెట్టారు. రాబర్ట్ వాధ్రాను పక్కనపెట్టారు. తాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు. నామినేషన్ల కార్యక్రమానికి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్రనేతలకు వర్తమానం పంపారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రియాంకాగాంధీ పోటీ చేయడం లేదు. అమేఠీ నుంచి కేఎల్ శర్మ అనే వ్యక్తిని రంగంలోకి దించారు. ఆయన ఇంతవరకు రాయబరేలీలో సోనియాగాంధీ మేనేజర్ గా పనిచేశారు. రాజకీయ అనుభవం లేదు. పైగా పుట్టెడు అవినీతి ఆరోపణలున్నాయి. సోనియా పేరు చెప్పి రాయ్ బరేలీని దోచుకున్నారని కేఎల్ శర్మపై అభియోగాలున్నాయి. ఎలాగూ ఓడిపోతారు కదాని అమేఠీలో కేఎల్ శర్మను రంగంలోకి దించి ఉంటారని అనుకుంటున్నారు…

స్మృతీ ఇరానీ సవాలుతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్

గత పదేళ్లుగా ఆ రెండు నియోజకవర్గాలపై గాంధీ కుటుంబం పట్టు తగ్గుతూ వస్తోంది. 2009లో మూడున్నర లక్షల మెజార్టీతో అమేఠీలో గెలిచిన రాహుల్.. 2014లో లక్ష మెజార్టీకి తగ్గారు. 2019లో స్మృతీ ఆయన్ను 55 వేల మెజార్టీతో ఓడించారు. రాయ్ బరేలీలో సోనియా మెజార్టీ కూడా తగ్గుతూ వచ్చింది. 2014లో ఆమెకు మూడున్నర లక్షల మెజార్టీ వచ్చింది. 2019లో అది లక్షా 67 వేలకు తగ్గింది. అందుకే ఈసారి పోటీ చేసేందుకు ఆమె వెనుకాడారని చెబుతారు.పైగా అమేఠీ నియోజకవర్గాన్ని స్మృతీ ఇరానీ బాగా అభివృద్ధి చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సారి రాయ్ బరేలీలో కూడా బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. రాయబరేలీ పోటీలో గెలిచినా రాహుల్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమవుతారని జనంలోకి తీసుకెళ్లబోతోంది. ఆయన వయనాడ్ ఎంపీగా కొనసాగి.. రాయ బరేలీని వదిలేస్తారని చెబుతోంది. అందుకే ప్రజాధనం వృథా కాకుండా ఉండాలంటే బీజేపీకి ఓటెయ్యాలని ప్రచారం చేయబోతోంది….