వైసిపి, టిడిపి-బిజెపి-జనసేన కూటముల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున కొందరు నేతలు ప్రచారంలో పాల్గొనగా, మరికొంతమంది నేతలు ఈ వారంలో ప్రచారానికి రానున్నారు. తెలుగుదేశం కూటమి అభ్యర్థులను కలవరానికి గురిచేసిన గుర్తుల గుబులుకు బుధవారం రాత్రి ఈ నియోజకవర్గంలో పాక్షికంగా తెరపడింది. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రాజానగరం, నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీచేస్తుండడంతో పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్ధులెవ్వరికీ జనసేన గుర్తు గాజు గ్లాస్‌ను కేటాయించలేదు…అయితే రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేడా శ్రీనివాస్‌కు గాజు గ్లాస్‌ను కేటాయించారు. ఈ నేపథ్యంలో టిడిపికి బదిలీ కావాల్సిన జనసేన ఓట్లు చీలే అవకాశం కన్పిస్తోంది.
పార్టీలు కలిసినా క్యాడర్ లో ఇంకా నిర్లిప్తత
రాజమహేంద్రవరం ఎంపి స్థానానికి వైసిపి నుంచి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, టిడిపి కూటమి తరపున బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీలో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైసిపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి బోడా వెంకట్ బరిలో ఉన్నారు. వారి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా మారింది. వైసిపి, టిడిపి అభ్యర్థుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. రాజమహేంద్రవరం రూరల్‌లో ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై జనసైనికుల్లో వ్యతిరేకత ఉంది. జనసేన పార్టీ …ఈ స్థానం నుండి పోటీచేయకుండా గోరంట్లే అడ్డుపడ్డారనే అభిప్రాయం వారిలో మెండుగా ఉంది. ఈ పరిస్థితులను వైసిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అవకాశంగా మార్చుకున్నారు. రామచంద్రాపురం నుంచి ఇక్కడకు వలస వచ్చినప్పటికీ వైసిపి నేతలను కలుపుకుని వెళుతున్నారనే అభిప్రాయం ఉంది.
ఆనపర్తిలో చివరి క్షణంలో సీటు మార్పుతో గందరగోళం
అనపర్తిలో మొన్నటివరకూ టిడిపి నేతగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి తరపున పోటీచేస్తున్నారు. వైసిపి అభ్యర్థి సత్తిసూర్యనారాయణ రెడ్డి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున డాక్టర్ ఎల్ల శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. చివరి నిముషంలో టికెట్ కోసం బిజెపిలోకి మారారనే విమర్శలు రామకృష్ణారెడ్డి ఎదుర్కొంటున్నారు. రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, వైసిపి అభ్యర్థి జక్కంపూడి రాజా, కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకటశ్రీనివాస్ మధ్య పోరు జరుగుతోంది. ఇక్కడ ఏ పార్టీ అయినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవ్వూరు నుంచి గోపాలపురం ఎంఎల్ఎ తలారి వెంకట్రావు, గోపాలపురం నుంచి కొవ్వూరు ఎంఎల్ఎ, మంత్రి తానేటి వనిత పోటీలో ఉన్నారు.
కలసి పని చేస్తే భారీ విజయాలు
కొవ్వూరులో టిడిపి నుంచి మాజీ ఎంఎల్ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి అరిగెల ఆరుణకుమారి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. గోపాలపురం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు మద్దిపాటి వెంకటరాజు టిడిపి నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ వనిత, వెంకటరాజు మధ్య ద్విముఖ పోరు నెలకొంది.నిడదవోలులో వైసిపి నుంచి జి. శ్రీనివాసనాయుడు, జనసేన నుండి కందుల దుర్గేష్, కాంగ్రెస్ నుంచి పెద్దిరెడ్డి సుబ్బారావు తలపడుతున్నారు. ఈ నియోజక వర్గంలో మాజీ ఎంఎల్ఏ బూరుగుపల్లి శేషారావు టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో దుర్గేష్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. జనసేన గెలుపు టిడిపి సహకారంపైనే ఆధార పడి ఉంది. నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారో వేచి చూడాల్సి ఉంది.