దేశంలో ఒక పక్క ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అర్థం లేని, పొంతన లేని స్టేట్ మెంట్స్ తో కాంగ్రెస్ అగ్రనేతలు పార్టీని ఇరకాటంలో పెడుతున్న వేళ… మరో శ్రేణి నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని విడనాడుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉండటం తమ వల్ల కాదని వాళ్లు చేతులెత్తేస్తున్నారు…
అరవింద్ లవ్లీ నిష్క్రమణ…
ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుగా కాంగ్రెస్ మూడు చోట్ల బరిలోకి దిగుతోంది. ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల ఓటింగ్ జరుగుతోంది. త్వరలో రాహుల్ గాంధీ అక్కడ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఇంత హడావుడు సాగుతుండగా.. అకస్మాత్తుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ (డీపీసీసీ) అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలతో కాలయాపన చేసే ఆప్ నేతల సరసన తాను కూర్చోలేనని లవ్లీ అంటున్నారు.వారితో కలిసి ప్రచారం చేయలేనని తెగేసి చెప్పారు. ఆయన ఢిల్లీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు…
స్వేచ్ఛగా పనిచేయనివ్వలేదు…
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అరవింద్ సింగ్ లవ్లీ తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రెండు లోక్ సభ సీట్లను పూర్తిగా కొత్తవారికీ, అదీ ఢిల్లీ రాజకీయాలతో సంబంధం లేని వారికి కేటాయించడం సరికాదని, తాను వైదొలగడానికి అది కూడా ఒక కారణమని లవ్లీ ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీని పునరుద్ధరించేందుకు, దానికి పూర్వవైభవం తెచ్చేందుకు తాను చేసిన ప్రయత్నాలకు సహకారం లభించలేదని, పైగా మోకాలడ్డేందుకు కొందరు నేతలు కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు ఏడాది కాలంలో తన చర్యలకు పార్టీ మద్దతు లభించలేదని ఆయన అన్నారు.
కనీసం జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ నియామకానికి కూడా తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన గగ్గోలు పెట్టారు…
పీసీసీని సమర్థించరా….
రెండు కీలకాంశాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని సంప్రదించలేదని తెలుస్తోంది. ఆప్ తో పొత్తు పెట్టుకునే క్రమంలో ఢిల్లీ యూనిట్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించింది. పొత్తును ప్రకటించేసిన తర్వాత ఆప్ తో కలిసి పనిచేయాలని రాష్ట్ర శాఖను ఆదేశించింది. ముగ్గురు అభ్యర్థుల ఎంపికలోనూ పీసీసీకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. పత్రికల్లో మాత్రమే ఆ జాబితాను పీసీసీ నేతలు చూడగలిగారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట….