విజయనగరం రాజుకు తప్పని రెబల్ – కుమార్తెకు పోటీగా జోరుగా గీత ప్రచారం !

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బెడిసికొట్టింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్రంగా నామినేషన్‌ వేయడమే కాదు. అధిష్టానం పిలుపును కూడా సున్నితంగా తిరస్కరించారు. ఇందుకు ముమ్మాటికీ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, స్థానిక టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి తండ్రి అశోక్‌ గజపతిరాజు వైఖరే కారణమంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. అత్యధికంగా బిసిలు ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన 35 సంవత్సరాలుగా టిడిపి నుంచి ఒసి అభ్యర్థులే పోటీలో నిలిచారు.

2014లో గెలిచిన మీసాల గీత

2014 ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు ఎంపీగా పోటీ చేయడంతో, అనూహ్యంగా బిసి సామాజికవర్గానికి చెందిన మీసాల గీతకు ఎమ్మెల్యేగా పోటీచేందుకు అవకాశం లభించింది. విజయం కూడా సాధించారు. 2019 ఎన్నికల్లోనూ అశోక్‌ మరోసారి ఎంపీగా పోటీకి దిగడంతో గీత లేదా అదే సామాజికవర్గానికి చెందిన వేరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్‌ లభిస్తుందని చాలా మంది భావించారు. అందుకు భిన్నంగా తన కుమార్తెకు సీటు కట్టబెట్టుకోవడంలో అశోక్‌ సఫలీకృతులయ్యారు. ఆశాభంగానికి గురైన గీత చంద్రబాబు జోక్యంతో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేశారు. అంతకు ముందు నుంచే గీతను పక్కనెబట్టి నియోజకవర్గ రాజకీయాల్లో అశోక్‌ తలదూర్చడంతో ఇద్దరి మధ్య వైరం ఏర్పడింది. చివరికి పార్టీ కార్యక్రమాలు కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోతుండడంతో గీత క్రమంగా బంగ్లా రాజకీయాలకు దూరమయ్యారు.

సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకునన గీత

పార్టీ కార్యాలయం కూడా అశోక్‌ ఇల్లే కావడం వల్ల, గీత అనివార్యంగా ప్రత్యామ్నాయ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల్లోనూ ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోక పోవడంతో గీత స్వతత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో, చంద్రబాబు ఇటీవల చేపట్టిన జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయనగరంలో గీత, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జునలను, భోగాపురం కర్రోతు సత్యనారాయణను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. అనుకున్నట్టు అందర్నీ ఒప్పించి పార్టీ ప్రచారంలో పాల్గొనే విధంగా చేశారు కానీ గీతను మాత్రం ఒప్పించలేకపోయారు.

వారసురాలికి కోసం గట్టి ప్రయత్నం చేయని అశోక్ గజపతి రాజు

ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబు పిలిచినప్పటికీ ఆమె కలవలేదు. దీంతో, టిడిపిలోని బిసి ఓట్లు చీలే ప్రమాదం లేకపోలేదు. దీనికితోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఆమె అనుచర గణం ఉంది. కుటుంబం బలమూ ఉంది. ఈనేపథ్యంలో ఆమెకు ఎన్ని ఓట్లు వెళ్లినా ఆ మేరకు టిడిపికి నష్టమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే టిడిపి చేసుకున్న స్వయం కృపరాధమేనని కూడా చర్చనడుస్తోంది. సొంతపార్టీ అశోక్‌ గజపతిరాజుకు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, తొలిసారిగా గీత ఆయన వైఖరిని విభేదించి రెబల్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.