ఓటుకు నోటు కేసు తరహాలో ప్రశ్నలకు నోట్లు తీసుకుని అనర్హత వేటుకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా…మరోసారి తాను ప్రాతినిధ్యం వహించిన కృష్ణనగర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆమెను చూసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి సమానంగా జనం పరుగులు తీస్తున్నప్పటికీ వారిలో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. చూస్తాం కానీ ఓటెయ్యం అన్నట్లుగా వాళ్ల తీరు ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి……
ప్రత్యర్థి రాజకుటుంబం మహిళ…
కృష్ణనగర్ ఒక చారిత్రక పట్టణం. నవాబ్ సిరాజుద్దౌలాను బ్రిటిష్ వారు ఓడించడానికి అక్కడి రాజు సహకరించారు. చరిత్రలో దాన్నే ప్లాసీ యుద్ధం అని పిలుస్తారు. తర్వాతి కాలంలోనూ రాజకుటుంబానికి చెందిన రాజా కృష్ణచంద్రరాయ్ బ్రిటిష్ వారికి సాయపడ్డారు. ఆయన పేరే పట్టణానికి పెట్టారని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అదే రాజకుటుంబానికి చెందిన అమృతా రాయ్ అలియాస్ రాణి మా ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు…
మహువా అహంకారి అంటున్న జనం….
అవినీతిమరక పడిన మహువాను మళ్లీ నిలబెట్టడంపై తృణమూల్ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమెకు గ్లామర్ తప్పితే పొలిటికల్ గ్రామర్ తెలియదని జనం ఆరోపిస్తున్నారు. ఆమె సొంత బృందాన్ని తీసుకొచ్చి ఆడియో, వీడియో ప్రచారం చేస్తున్నప్పటికీ జనంలో మంచి పేరు మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు. స్థానిక నాయకులను ఆమె ఎన్నడూ లెక్కచేయలేదు. పార్లమెంటులో తమ నియోజకవర్గంపై ఆమె ఎప్పుడూ ప్రశ్నలు అడగలేదని, కార్పొరేట్ స్టయిల్ ప్రదర్శనకు ప్రాధాన్యమిచ్చారని తృణమూల్ ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు.
రాణి మా పట్ల ప్రజల్లో గౌరవం….
అమృతా రాయ్ అలియాస్ రాణి మా… వ్యక్తిగతంగా ప్రజలకు తెలియకపోవచ్చు. గత ఎన్నికల్లో తృణమూల్ భారీ మెజార్టీ సాధించి ఉండొచ్చు. ఐనా సరే ఈ సారి మాత్రం రాణి మా వైపే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఆమెకు బీజేపీ సీనియర్లతో పాటు ఢిల్లీలో మంచి పేరు ఉంది. దాని ఆధారంగా నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకు వస్తారని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఆమె కుటుంబం అనేక ఆలయాలు కట్టించింది. బడులు నిర్వహిస్తూ విద్యాదానం చేస్తోంది. మరో పక్క నియోజకవర్గంలో ముస్లింలు ఇంతవరకు తృణమూల్‌కు ఓటేస్తూ వచ్చారు. ఈ సారి బీజేపీకి ఓటేస్తామని ముస్లిం సోదరులు చెబుతున్నారు.. సామాజిక వర్గ సమీకరణాలు తమకు కలిసొస్తాయని బీజేపీ విశ్వసిస్తున్న తరుణంలో మహువా మాత్రం తృణమూల్ పార్టీ పరపతిని, ముఖ్యమంత్రి మమతా దీదీ పేరును వాడుకోవాలనుకుంటున్నారు..