వాళ్లలో ఐకమత్యం లేదు. ఒకరిపై ఒకరు పడి ఏడ్వటం మాములు విషయమైపోయింది. ఎక్కడా గెలవలేమని నిర్ధారించుకుని, గెలిచే అవకాశం ఉందని అనుమానించే ఒకటి రెండు రాష్ట్రాల విషయంలో కీచులాడుకోవడమే కాదు.. రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటున్నారు. దూరంగా ఉండి చోద్యం చూస్తున్న బీజేపీపైనా బ్లేమ్ ఆడేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నారు.. అదే కాంగ్రెస్ పార్టీ, అదే కమ్యూనిస్టు పార్టీ. అదే ఇండియా గ్రూపు…
విజయన్ పై ప్రియాంక ఆగ్రహం…
దేశం మొత్తం మీద ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కేరళలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం విడివిడిగా బరిలోకి దిగాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వస్తాయన్న ఒక నమ్మకం ఉంది. వాటిని పంచుకోవడం హస్తం పెద్దలకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండే పార్టీలు ఇప్పుడు ఆరోపణాస్తాలు కూడా సంధించుకుంటున్నాయి. మీరు బీజేపీతో కలిసిపోయారంటే మీరు బీజేపీతో కలిసిపోయారని దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు.అంతకుముందు నుంచే విజయన్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేతలు.. ఈ దెబ్బతో స్పీడు పెంచారు. విపక్ష నేతలందరినీ బీజేపీ టార్గెట్ చేసిందని చాలా మందిని జైల్లో పెట్టించిందని కాంగ్రెస్ అంటోంది అయితే విజయన్ ను మాత్రం టచ్ చేయలేదని చెప్పింది. విజయన్ పై ఎన్నో కేసులున్నప్పటికీ.. ఒక్కదాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లడం లేదని కాంగ్రెస్ అంటోంది. తొలుత రాహుల్ గాంధీ ఆ మాట అంటే.. రెండు రోజుల తర్వాత ప్రియాంకాగాంధీ కూడా అదే వాదనను ప్రచారం చేస్తున్నారు…
రాహుల్ డీఎన్ఏపై సీపీఎం అనుమానాలు….
ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంలో నైతిక విలువలకు కూడా తిలోదికాలిచ్చేశారు.రాహుల్ గాంధీ నిజంగా గాంధీ – నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తా కాదా అని తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కేరళలోని ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ చేసిన డిమాండ్ చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తే.. సీపీఎం సమర్థించడం పార్టీల మధ్య ఉన్న వైరానికి నిదర్శనంగా నిలిచింది. పైగా రాహుల్ గాంధీ తమను విమర్శిస్తే తాము చూస్తూ ఊరుకోవాలా అని సీపీఎం ప్రశ్నిస్తోంది..రాహుల్ డీఎన్ఏను ప్రశ్నిస్తే తప్పేమిటని నిలదీస్తోంది..
మధ్యలో బీజేపీని లాగడమెందుకో….
కాంగ్రెస్, సీపీఎం కొట్టుకుంటున్నాయి సరే..మరి బీజేపీని ఎందుకు వివాదంలోకి లాగుతున్నాయనేది పెద్ద ప్రశ్న. వాళ్లు ఒక్క విషయం మరిచిపోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. వారికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తప్పు చేసిన వారిని వదిలేదే లేదని ప్రకటించింది. కేంద్ర సంస్థలు కేసులను తమ షెడ్యూల్ ప్రకారం విచారిస్తాయి. విజయన్ పై కూడా విచారణ త్వరలో ప్రారంభం కావచ్చు. దానికి బీజేపీకి సంబంధం లేదని గుర్తించాలి….