అశోక్ గెహ్లాట్ .. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. రెండు సార్లు సీఎంగా పనిచేసిన నేత. సుపరిపాలనలో సాంతం విఫలమై అధికారాన్ని కోల్పోయిన నాయకుడు. పుత్రవాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, అవినీతికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కిన కొందరు ముఖ్యమంత్రుల్లాగే గెహ్లాట్ కూడా చేయని అక్రమం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో గెహ్లాట్ ఫోన్ ట్యాపింగుకు పాల్పడినట్లు ఇప్పుడిప్పుడే వెల్లడవుతోంది. దానితో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడింది…
మాజీ సహాయకుడు చెప్పిన నిజం…
అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేసిన లోకేష్ శర్మ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ విస్తుపోయే నిజాలు వెల్లడించారు. 2020లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయినప్పుడు రెబెల్ నేత సచిన్ పైలట్ , ఆయన అనుచరుల ఫోన్లను గెహ్లాట్ ట్యాపింగ్ చేయించారని అప్పటి ఓఎస్డీ చెబుతున్నారు. కొన్ని ఫోన్ కాల్ రికార్డింగులను అశోక్ గెహ్లాట్ స్వయంగా తనకు ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇచ్చారని.. వాటన్నింటినీ మీడియాకు విడుదల చేయాలని కోరారని కూడా లోకేష్ వెల్లడించారు. ఆ పెన్ డ్రైవ్లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, దివంగత కాంగ్రెస్ నేత భన్వర్ లాల్ శర్మ, మధ్యవర్తి సంజయ్ జైన్ మాటలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
షెకావత్ ను ఇరికించే ప్రయత్నం..
ఫోన్ ట్యాపింగుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తనను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిందని లోకేష్ శర్మ గుర్తుచేశారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత గెహ్లాట్ తనను పట్టించుకోలేదని, కేసులను ఎదుర్కొంటున్నా ఎలాంటి సాయం చేయలేదని లోకేష్ వాపోయారు.గెహ్లాట్ నాయకత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ బృందం..పార్టీ అధిష్టానాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటి నుంచి వారి ఫోన్లు ట్యాపింగుకు గురయ్యాయని వెల్లడించారు. మొత్తం వ్యవహారంలో గజేంద్ర సింగ్ షెకావత్ ను విలన్ ని చేయాలని చూసినట్లు ఆయన విశ్లేషించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రచారం చేసుకునేందుకు గెహ్లాట్ ప్రయత్నించారన్నారు.
మౌనం వహిస్తున్న గెహ్లాట్…
వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి షెకావత్ 2021లోనే ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు సచిన్ పైలట్ వర్గం కూడా గెహ్లాట్ పై కారాలు మిరియాలు నూరుతోంది. తమను ఎలా టార్గెట్ చేశారో.. స్వయంగా గెహ్లాట్ సహాయకుడే చెప్పాడని అంటోంది. ఇంత జరుగుతున్నా గెహ్లాట్ మాత్రం మీడియాకు అందుబాటులోకి రాలేదు.ఆయన వర్గం వాళ్లు కూడా నో కామెంట్స్ అనే సమాధానమిస్తున్నారు…