జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి టిడిపి-జనసేన-బిజెపి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గడచిన ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓటమిని చవిచూశారు. ఈసారి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తుండడంతో ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విజయంపై ఆ పార్టీ శ్రేణులు భారీ అంచనాలు పెట్టుకుని పని చేస్తున్నాయి. అధినేత విజయమే లక్ష్యంగా సాయిశక్తులా కషి చేస్తున్నాయి.
అన్ని వనరులతో పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థి
అధికార వైసిపి నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎంఎల్ఎగా, ఎంపీగా పనిచేసిన ఆమె పోటీ చేసిన సందర్భాలన్నింటిలోనూ ఒకసారి కూడా ఓటమిని చవి చూడలేదు. ఈ నేపథ్యంలోనే వైసిపి తన వ్యూహాలను అమలు చేసే ప్రయత్నాల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన ఏదొక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉందని తొలుత అందరూ భావించారు. అనంతరం పాలకొల్లు, తిరుపతి అని ప్రచారం సాగింది. కాని అనూహ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన ఇక్కడ తరచూ పర్యటనలు చేస్తున్నారు.
పవన్ కోసం బరిలోకి ఫ్యాన్స్
నియోజకవర్గ పరిధిలో ఉన్న గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఒక ఇంటిని సైతం అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటానని, ఆధ్యాత్మిక రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఇటీవల చేబ్రోలులో జరిగిన సభలో నియోజకవర్గ సమస్యలపై మేనిఫెస్టోను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఇక్కడే ఉంటూ ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి సారించారు. మంగళవారం పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా భారీ ఎత్తున జనసేన శ్రేణులు హాజరు కావడంతో పవన్ విజయ అవకాశాలపై చర్చ మొదలైంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
వర్మ సహకరిస్తున్నారు కానీ పోలింగ్ సమయంలో ఏం చచేస్తారో ?
టిడిపి ఇన్‌ఛార్జి, టిడిపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎంఎల్ఎ ఎస్విఎస్ఎన్.వర్మతో సఖ్యతకు న్రయత్నిస్తున్నారు. తగ్గాల్సిన చోటల్లా తగ్గుతూ నెగ్గుకు రావాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. భిన్న తీర్పులకు చరిత్ర కలిగిన పిఠాపురం నియోజకవర్గంలో మళ్లీ పాగా వేయాలనే లక్ష్యంతో వైసిపి అభ్యర్థి వంగా గీత ప్రచారంలో పాల్గొంటున్నారు. పిఠాపురంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, లోకల్‌గా ఉన్న తనకు స్థానిక సమస్యలపై ఎంతో అవగాహన ఉందని ఆమె ప్రజలకు చెప్పుకొస్తున్నారు.