పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లోనే సత్తా చాటిన బీజేపీ ఈ సారి తృణమూల్ ను పూర్తిగా దెబ్బకొట్టే ప్రయత్నంలో ఉంది. ప్రతీ లోక్ సభా నియోజకవర్గంలోనూ తన బలాన్ని రెట్టింపు చేసుకుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. బెంగాల్లో ఉన్న 42 లోక్ సభా నియోజకవర్గాల్లో డైమండ్ హార్బర్ కూడా ఒకటి. సౌత్ పరగణాస్ జిల్లాలో ఉన్న డైమండ్ హార్బర్లో బీజేపీ అద్భుతాలు సృష్టించబోతోందని వార్తలు వస్తున్నాయి….
అభిషేక్ బెనర్జీ వర్సెస్ అభిజిత్ దాస్…
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ సారి డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ తరపున అభిజిత్ దాస్ బరిలోకి దిగుతున్నారు. కమలం పార్టీ కాస్త ఆలస్యంగా తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అభిజిత్ దాస్ గట్టి పోటీ ఇస్తారని, గెలిచినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విదేశీయుల పాలనతో బ్రిటిష్ వారికి కేంద్రకంగా ఉన్న డైమండ్ హార్బర్ ప్రాంతం, ప్రస్తుత మమతా బెనర్జీ పాలనతో హింసకు కేంద్రబిందువుగా మారింది. హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తమకు ఓటేస్తే డైమండ్ హార్బర్ ను శాంతికి చిహ్నంగా మార్చుతామని బీజేపీ అంటోంది….
అభివృద్ధికి అడ్డుపడుతున్న అవినీతి…
సీపీఎం తరపున కూడా ఒక అభ్యర్థి ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం టీఎంసీ, బీజేపీ మధ్యే ఉంటుంది. స్థానిక జనం దాన్ని భాయిపో వర్సెస్ బాబీ అని పిలుస్తున్నారు. బెంగాలీలో భాయిపో అంటే మేనల్లుడు అని అర్థం, బాబీ అంటే ప్రియమైన వ్యక్తి అని అర్థం. అంటే మమత మేనల్లుడికి, స్థానిక బీజేపీలో పాపులర్ నాయకుడికి మధ్య పోటీ కావడంతో అలా పిలుస్తున్నారు. అభిజిత్ దాస్.. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు.గతంలో రెండు మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఐనా ఆ ఎన్నికలు వేరు, ప్రస్తుత ఎన్నికల తీరు వేరు అని దాస్ అంటారు.అభిషేక్ బెనర్జీకి ఆ ప్రాంతంతో కొంత విడదీయరాని బంధం ఉన్న మాట వాస్తవం. అయితే గత పదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి అభిజిత్ రూ. 5,800 కోట్లు కేటాయించారని టీఎంసీ జనం ప్రచారం చేస్తున్నారు.అందులో సగానికి పైగా నేతలు బొక్కేందుకే సరిపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేస్తే అదే సంగతి బయటపడింది. పనులు చేస్తున్నట్లు కలరింగ్ తప్పితే వాస్తవంగా జరిగిందీ శూన్యమని చెబుతున్నారు.
జనంలో అభిషేక్ పట్ల వ్యతిరేకత…
డైమండ్ హార్బర్లో జాలర్లు, కార్మిక కర్షకులు ఎక్కువగా ఉంటారు. సామాన్య జనానికి అభిషేక్ బెనర్జీ అందుబాటులో ఉండరని ఎవరిని అడిగినా చెబుతారు. తాను చెప్పిందే జరగాలని అభిషేక్ అంటుంటారు. అందుకే ఆయనకు హిట్లర్ అన్న నిక్ నేమ్ ఉంది.రిక్షా, ఆటో కార్మికులను సైతం తృణమూల్ నేతలు బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో టీఎంసీ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లాలంటే ముందు తృణమూల్ నేతలకు కప్పం కట్టాలి. లేకపోతే సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతివ్వరు. పంచాయతీ ఎన్నికల్లో సైతం తృణమూల్ గూండా రాజ్యం నడుస్తుంది. ఎదురుపార్టీ వాళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తే కొట్టి వెళ్లగొడతారు. అందుకే విసిగిపోయిన జనం ఈ సారి బీజేపీకి ఓటెయ్యాలనుకుంటున్నారు. కమలం పార్టీ నేతలు కూడా ఈ సారి ప్రతిఘటించి నిలబడటమే కాకుండా.. గెలిచి చూపిస్తామని అంటున్నారు….