హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ కు చాన్స్ ఉందా ? పెద్దిరెడ్డి ఆపరేషన్ ఫలిస్తుందా ?

సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. హిందూపురం నియోజకవర్గం అంటేనే టిడిపికి కంచుకోటగా పిలుస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అక్కడ టిడిపి ఓటమి చెందిన దాఖలాల్లేవు. 1983 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి టిడిపి వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు మూడుసార్లు విజయం సాధించారు.

ఇప్పటి వరకూ ఇతర పార్టీల వల్లే ఎక్కువగా గెలుపు

హిందూపురంలో ఇన్నేళ్లుగా టిడిపి విజయం సాధిస్తూ రావడానికి కారణం టిడిపి బలం కొంత కారణమైతే, ప్రత్యర్థుల్లోని ముఠాపోరులు ప్రధాన కారణంగా ఉంటూ వస్తున్నాయి. ఈ గ్రూపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ గ్రూపు తగాదాలతోనే నవీన్‌నిశ్చల్‌ను కాదని చివరి నిమిషంలో రిటైర్డు ఐపిఎస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ను తెచ్చి వైసిపి అభ్యర్థిగా పెట్టింది. స్థానికేతరుడు అయిన మహ్మద్‌ ఇక్బాల్‌ అనుకున్నంతగా రాణించలేకపోయారు. అయినా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక అక్కడి గ్రూపు తగాదాలు మరింత పెరగడంతోపాటు రామకృష్ణారెడ్డి అనే వైసిపి నాయకుడు హత్య జరిగింది. ఈ తగాదాల నడుమ ఇక్బాల్‌ను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కొత్త అభ్యర్థి, స్థానికేతరులైన దీపికను తీసుకొచ్చారు.

వైసీపీ అభ్యర్థి దీపిక స్థానిక నేతల సహాకరం

ఆమెకు కూడా స్థానిక నాయకుల నుంచి సహకారం లభిస్తోంది. వ్యతిరేకించిన మహ్మద్‌ ఇక్బాల్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వైసిపి రాయలసీమ ప్రాంత ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే పైకి కలిసినట్టు కనిపిస్తున్నా తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం ఉంది.

ఎన్టీయార్‌… వరుసగా మూడు తడవలు

2014లో మొదటిసారి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి నవీన్‌ నిశ్చల్‌పై 16,196 వేల ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంతటా వైసిపి గాలి వీచినా.. హిందూపురంలో మాత్రం 18,028 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపొందారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మూడోసారి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన నామినేషన్‌ సైతం దాఖలు చేశారు.