నామినేష్లు వేసిన అభ్యర్థులు ఏఏ వర్గాలను ఎలా రాబట్టుకోవాలన్న దానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. అనేక ప్రలోభాలకు తెరలేపారు. అసంతృప్తిగా ఉన్న నేతలకు ప్యాకేజీలు ఇస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా చేరికలు పేరుతో పార్టీల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. అనేక నియోజకవర్గంలో నిత్యం ఇదే తరహా కార్యక్రమాలు రోజూ జరుగుతున్నాయి. ఒక పార్టీలో ఉంటూ అసంతృప్తిగా ఉన్ననేతలను ప్యాకేజీలతో లాగేస్తున్నారు. తెల్లారేసరికి పార్టీలు ఫిరాయిస్తున్నారు.
ప్రభావం చూపే సామాజిక నేతలకు భారీగా ఆఫర్లు
పార్టీలు మారే నేతల్లో మండలస్థాయి నేతలే ఎక్కువగా ఉంటున్నారు. రూ.5 లక్షల నుంచీ నేతల స్థాయి, జనంలో ఉన్న పలుకుబడిని బట్టి రూ.25 లక్షల వరకూ ఇస్తున్నారు. కార్పొరేటర్లకు రూ.3 లక్షలు, డివిజన్ బాధ్యులకు లక్ష రూపాయలు చొప్పున ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్యాకేజీలు ఇచ్చారు. వారందరినీ దారిలోకి తెచ్చుకునే వ్యూహాన్ని ఇలా అమలుచేశారు. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఉన్నందున సమీకరణల్లో మార్పుల కోసం ఈ తరహా విధానాలను అమలు చేస్తున్నారు. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతోంది.
నీటి సమస్య గుర్తు రాకుండా జాగ్రత్తలు
ట్యాంకర్లతోనే నీటిని అందించే గ్రామాలు వందల్లో ఉన్నాయి. పట్టణాల్లోనూ భారీ తాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇరవై ఏళ్లుగా చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు చెబితే జనం నమ్మరనే భావనకు వచ్చేశారు. అందుకే ఓట్ల కోసం వాటిని వదిలేసి ప్యాకేజీలు, సామాజిక ఎజెండాలు, కొనుగోళ్లు, మద్యం, డబ్బుతోనే నడుస్తున్నారు. నామినేషన్లకు వాహనాలు పెట్టి జనానికి మద్యం డబ్బులు ఇచ్చి భారీగా తరలిస్తున్నారు. నామినేషన్ రోజునే ఒక్కో అభ్యర్థికి రూ.రెండు కోట్ల వరకూ ఖర్చవుతోంది. ఇలా ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
అప్పటికప్పుడు నెరవేర్చాల్సిన హామీలు కూడా
అప్పటికప్పుడు నెరవేర్చాల్సిన హామీలు కూడా ఉంటున్నారు. ఎంత ఖర్చు అయినా వెనుకాడటం లేదు. స్వయంగా బోర్లు వేయించడం దగ్గర్నుంచి చాలా పనులు చేస్తున్నారు. అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు. పార్టీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది.