ఎన్డీఏ కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగారు రంగా కుమారుడు రాధ. NDA కూటమి గెలుపు బాధ్యతలను ఆయన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని వంగవీటి రాధా పర్యటనతో ప్రస్తుత ఎన్నికల్లో కూటమికి లాభం చేకూరుతుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
పోటీకి దూరంగా వంగవీటి రాధా
బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా పేరు ప్రత్యేకమనే చెప్పాలి. కాపు నాయకుడిగా రంగా ఎదిగినా.. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రంగా అనంతరం ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చిన రాధా రాజకీయపరంగా కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆయన NDA కూటమి నుంచి స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసి. ఒకసారి ఎమ్మెల్యేగా పని చేసిన రాధా.. 2019తో పాటు తాజా ఎన్నికల్లో ప్రత్యక్షపోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేయక పోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొన్నారు. కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతలను ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. కూటమి గెలుపే లక్ష్యంగా రాధా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. .
కాపులు, బలిజల్లో రాధాకు ఆదరణ
కాపులు, బలిజలు అధికంగా ఉండే నియోజకవర్గంలో వంగవీటి రాధా పర్యటన సాగేలా కూటమి ప్రణాళిక వేసినట్లు సమాచారం. వంగవీటి మోహనరంగాను అభిమానించే నియోజకవర్గాలనూ రాధా టచ్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. 2019లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి TDPకు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు. అనుకున్నంత స్థాయిలో ఆ ప్రచారం. తెలుగుదేశానికి కలసిరాలేదు. ఈసారి మాత్రం కంపల్సరీగా గెలవాలనే లక్ష్యంతోనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా YCP సహా జగన్ పాలనపై ఆరోపణలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
వైసీపీ ప్రభు్తవవైఫల్యాలపై ప్రచారం
2019 ఎన్నికల తర్వాత వైసీపీతో పాటు జగన్‌పై విమర్శలు చేయని రాధా ప్రస్తుతం స్టార్ క్యాంపైనర్‌గా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. YCP ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలని విషయాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చాలా ఆఫర్లు వచ్చినా.. రాధా.. తెలుగుదేశంతోనే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం కూటమి గెలుపు కోసం బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నారని టీడీపీ చెబుతోంది. తన రాజకీయ భవిష్యత్‌ను పార్టీకి అప్పగించి ప్రచారం మాత్రమే చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు.
వంగవీటి రాధా ప్రచారంతో కూటమి అభ్యర్థులకు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాపుల తరపున పవన్ కళ్యాణ్.. కూటమిలో ఉండగా వంగవీటి మోహనరంగా అభిమానులు, ఫాలోవర్స్ ఓట్లు రాధా ద్వారా కూటమికి పడే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.