ఉత్తర బెంగాల్లో కమల వికాసం !

గత ఎన్నికల్లో గెలిచారు. ఈ సారి కూడా ఖచితంగా గెలుస్తామని నమ్మకంతో ప్రచారం చేస్తున్నారు. తాజా సర్వేలు అదే మాట చెబుతున్నాయి. ఉత్తర బెంగాల్లోని పరిస్థితులు కమలం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కుల సమీకరణాలు, స్వయం ప్రతిపత్తి డిమాండ్లు, ఆర్థిక ప్యాకేజీలే ఎన్నికల అంశాలవుతుండగా.. అన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు ప్రకటించి జనాన్ని ఆకట్టుకున్నాయి…

రెండు దశల్లో ఎన్నికలు…

ఏడు దశల్లోనూ ఎన్నికలు జరిగే రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని చెప్పాలి. అందులో ఉత్తర బెంగాల్లోని ఆరు స్ఠానాల్లో మొదటి , రెండో దశ ఉన్నాయి. ఏప్రిల్ 19న జరిగే తొలి దశలో అలీపూర్దార్, జల్పాయ్ గురి, కొచ్ బెహార్ స్థానాలుండగా…. ఏప్రిల్ 26న జరిగే రాయ్ గంజ్, బాలుర్ ఘాట్, డార్జిలింగ్ స్థానాలున్నాయి. బీజేపీ దెబ్బకు భయపడి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ , ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. ఉత్తర బెంగాల్లోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు…

బీజేపీ అంటే భయపడుతున్న తృణమూల్…

ప్రధాని మోదీ అక్కడ డజనుకు పైగా ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. గత ఎన్నికల్లో అన్ని ఆరు స్థానాల్లో బీజేపీ గెలవడంతో తృణమూల్ కాంగ్రెస్ కు ఈ సారి ముచ్చెమటలు పడుతున్నారు. 2009 వరకు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఉత్తర బెంగాల్ 2014లో తృణమూల్ వశమైంది. అయితే 2019 నాటికి బీజేపీ దాన్ని చేజిక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సగానికి పైగా స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.

అనేక సమీకరణాల సమాహారం…

ఉత్తర బెంగాల్ ను కైవశం చేసుకోవాలంటే అన్ని సమీకరణాలను లెక్క చూసుకోవాలి. అనేక కులాలు, తెగల సమూహాలు అక్కడ ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో పక్క దేశ ప్రజల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. ఆ క్రమంలో రాజభాంసీ, కామట్పూరి, గోర్ఖా, నేపాలీల ప్రభావం ఈ సారి ఎన్నికలపై కూడా ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనార్టీ హిందూ గ్రూపు రాజభాంసీలు బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు.పౌరసత్వ చట్టం అమలు చేయాలని కూడా అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు బీజేపీ సుముఖంగా ఉండటం, పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అటు వలస వచ్చిన వాళ్లు, ఇటు బెంగాలీలు బీజేపీకి మద్దతుగా ఉండటమే ఉత్తర బెంగాల్లో ఆ పార్టీ విజయానికి కారణమని చెబుతున్నారు. గూర్ఖాలాండ్ సమస్య పరిష్కారం కూడా బీజేపీతోనే సాధ్యమని పర్వతప్రాంత ప్రజల విశ్వాసం. పదకొండు గిరిజన తెగలకు ఎస్టీ హోదా ఇస్తామని బీజేపీ హామీ పలికింది.