నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి. నంద్యాల పార్లమెంటు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, డోన్, నందికొట్కూరు, పాణ్యం అసెంబ్లీ స్థానాలున్నాయి. నంద్యాల పార్లమెంటుకు టిడిపి తరపున బైరెడ్డి శబరి, వైసిపి తరపున పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. బైరెడ్డి శబరి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఇటీవల టిడిపిలో చేరారు. పోచా బ్రహ్మానందరెడ్డి 2019లో వైసిపి తరపున ఎంపిగా గెలిచారు. ఈసారి కూడా వైసిపి ఆయనకే టికెట్ కేటాయించింది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు
నంద్యాల అసెంబ్లీకి టిడిపి తరపున ఎన్ఎం.డి.ఫరూక్, వైసిపి తరపున శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున గోకుల్ కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఫరూక్ టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసిపి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆళ్లగడ్డలో టిడిపి తరపున భూమా అఖిల ప్రియ, వైసిపి తరపున గంగుల బిజేంద్రారెడ్డి బరిలో ఉన్నారు. అఖిల ప్రియ టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బిజేంద్రారెడ్డి వైసిపి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టిడిపికి అనుకూలంగా మారనుంది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే మైనస్
బనగానపల్లెలో టిడిపి తరపున బిసి జనార్ధన్ రెడ్డి, వైసిపి తరపున కాటసాని రామిరెడ్డి బరిలో ఉన్నారు. గతంలో చల్లా రామకృష్ణారెడ్డి ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్లు గెలిచేవారు. ఈసారి ఆయన చనిపోయారు. ఆయన కుమారుడు కూడా చనిపోయారు. కుటుంబం రెండుగా చీలిపోయింది. ఓ వర్గం టీడీపీ అభ్యర్థిగా మద్దతుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తోంది. శ్రీశైలంలో టిడిపి తరపున బి రాజశేఖర్ రెడ్డి, వైసిపి తరపున శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో ఉన్నారు. శ్రీశైలం ఆలయంలో ముస్లింలకు పెత్తనంపై బీజేపీ చేసిన పోరాటాలు కూటమి అభ్యర్థిగా అండగా ఉండనున్నాయి.
ఎదురీదుతున్న బుగ్గన
డోన్ టిడిపి తరపున కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, వైసిపి అభ్యర్థిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసిపి తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. నందికొట్కూరులో టిడిపి అభ్యర్థిగా గిత్తా జయసూర్య, వైసిపి తరపున దారా సుధీర్, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ బరిలో ఉన్నారు. అధికార వ్యతిరేకత పలు చోట్ల బలంగా కనిపిస్తోంది.