నాగ్ పూర్ నాదిరా అంటున్న రోడ్కరీ…

ఆయన అసలు పేరు నితిన్ గడ్కరీ. ఆయన చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బట్టి దేశ ప్రజలంతా ఆయన్ను రోడ్కరీ అని పిలుస్తారు.ప్రజల మనిషిగా ఆయన మంచి పేరే తెచ్చుకున్నారు. గడ్కరీ అలియాస్ రోడ్కరీ ఎక్కడకి వెళ్లినా జనం ఆయన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్నారు. మీరు మా కోసం మేము మీ కోసం అంటున్నారు..

రికార్డ్ మెజార్టీపై దృష్టి…

గడ్కరీ చాలా కాలం మహారాష్ట్ర రాజకీయాలకు పరిమితమయ్యారు. 2014లో మాత్రం నాగ్ పూర్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేశారు. అంతవరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నాగ్ పూర్ ఏకంగా గడ్కరీ ఇలాకా అయిపోయింది.కాంగ్రెస్ సైడైపోయింది. నాగ్ పూర్ అంటే గడ్కరీ అన్న పేరు వచ్చేసింది. 2019లో రెండో సారి కూడా గెలిచిన గడ్కరీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయంపై ధీమాగా ఉండటమే కాకుండా కనిష్టంగా ఐదు లక్షల మెజార్టీ వస్తుందని గడ్కరీ చెబుతున్నారు. ఆ మాత్రం రాకపోతే తాను ఎందుకన్నది గడ్కరీ ప్రశ్న..

రోడ్ షోలకు భారీగా జనం

కేంద్ర రవాణా, హైవే శాఖామంత్రిగా ఉన్న గడ్కరీ రోడ్ షోలకు జనం భారీగా తరలి వస్తున్నారు.గడ్కరీ కోసం గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. ఆయనకు కులం, మతం, భాషా, ప్రాంతీయ విభేదాలు లేవని జనం చెబుతారు. ప్రస్తుతం కులాన్ని పట్టుకుని వేలాడే పరిస్తితి లేదని, జనం వివేకవంతంగా ఉన్నారని గడ్కరీ విశ్లేషిస్తారు. బీజేపీ చేసిన అభివృద్ధిని చూసే జనం తనకు ఓట్లు వేస్తున్నారని ఆయన చెబుతున్నారు. కొన్ని పార్టీలు గతంలో కుల రాజకీయాలు చేసి బోల్తా పడ్డాయని ఆయన గుర్తుచేస్తున్నారు.

జమిలీ ఎన్నికలకే గడ్కరీ ఓటు

ప్రస్తుతం తాను రవాణా మంత్రిగా ఉన్నానని, ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి మోదీ ఎలాంటి బాధ్యత అప్పగించినా నెరవేర్చుతానని గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి పదవులు ప్రధాని విశేషాధికారమని ఆయన తేల్చేశారు.వన్ నేషన్ వన్ పోల్ అంటే జమిలీ ఎన్నికలు మనదేశానికి చాలా అవసరమని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తరచూ ఎన్నికలు జరగడం వల్ల.. ఎన్నికల నియమావళి అమలుకు వచ్చి, అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయని గడ్కరీ అంటున్నారు. మేలు చేయలేని ప్రభుత్వాన్ని జనం తరిమికొడతారని, ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నందునే బీజేపీని మూడో సారి గెలిపిస్తున్నారని గడ్కరీ విశ్లేషణ. నాగ్ పూర్ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 19న జరుగుతుంది…