ఏపీలో సాధారణ ఎన్నికలు వైసిపి, టిడిపికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠమే లక్ష్యంగా ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్ధులను రెండు పార్టీలు పోటీలో నిలిపాయి. అభ్యర్ధుల్లో అత్యధికంగా పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఉండటంతో డబ్బును మంచినీళ్ల ప్రాయం ఖర్చు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోటిఫికేషన్ రాక ముందు రూ. 100 కోట్లు పట్టి వేత
ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18 న విడుదల కానుండగా, ఇప్పటికే రూ.100కోట్ల విలువైన డబ్బు, మద్యం, లిక్కర్, డ్రగ్స్, తాయిలాలు ఇతర వస్తువులను ఈనెల 11 నాటికి జప్తు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనా వెల్లడించారంటే ఈ ఎన్నికల్లో ధన ప్రభావం ఏ స్దాయిలో ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీలో ఉండే అభ్యర్ధులు విచ్చల విడిగా కోట్లాది రూపాయిలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యదేశ్చగా తరలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు విచ్చల విడిగా ఖర్చు చేసేందుకు పోటీ పడుతున్నాయి.
ఒక్కో నియోజకవర్గం నుంచి రూ. వంద కోట్ల వరకూ ఖర్చు
ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీలు ఒక్కోనియోజకవర్గానికి ఆయా పార్టీలు రూ.70 నుంచి రూ.100 కోట్లు ఖర్చు ఖర్చు పెట్టే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నగదును భారీగా తరలించేందుకు రాజకీయపార్టీలు గతానికి భిన్నంగా ఆర్టీసీ కార్గోలను సైతం ఉపయోగించుకుంటున్నతీరును ఎన్నికల అధికారులు బయటపెట్టారు. ఎన్నికల నిబంధనలను తూట్లు పొడుస్తూ అధికారపార్టీ అభ్యర్ధులు ఇప్పటికే వలంటీర్లు, ఆర్పిలకు గిప్ట్లు, నగదును పంపణీ చేసినట్లు ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రవర్తనా నిబంధనలకు విరుద్ధంగా అనేక ప్రాంతాల్లో వలంటీర్లు అధికారపార్టీ అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పలువురిని ఇప్పటికే తప్పించింది.