శ్రీకాకుళంలో టీడీపీకి రెబల్స్ ఖాయం – సీట్ల మార్పునకు చంద్రబాబు నో

శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి గొండు శంకర్‌, పాతపట్నం నియోజకవర్గానికి మామిడి గోవిందరావు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. కానీ వీరిని మార్చి తమకు చాన్స్ ఇవ్వాల్సిందేనని గుండా లక్ష్మిదేవి , కలమట వెంకటరమణ డిమాండ్ చేస్తున్నారు. వీరి కోరిక మన్నించకపోవడంతో రెబల్స్ గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కార్యకర్తలతో సమావేశాలకు రెడీ

పాతపట్నంలో ఈనెల 13న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి మరోసారి కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని కలమట వెంకటరమణ నిర్ణయించారు. శ్రీకాకుళంలో ఈనెల 13 లేదా 14న కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోవాలని గుండ కుటుంబం భావిస్తున్నట్లు తెలిసింది. టిక్కెట్ల ప్రకటన తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు భారీగా కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. కొందరు నాయకులు ఒకడుగు ముందుకేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ కోసం విరాళాలు సైతం ప్రకటించారు.

చంద్రబాబు పిలిపించి మాట్లాడినా సద్దుమణగని పరిస్థితి

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్త నేతల్ని హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు చెప్పిన విషయాలను జాగ్రత్తగా విని నాలుగైదు రోజుల్లో ఏదో విషయం చెప్తానని, అప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని ఇరువురికి హామీనిచ్చారు. పార్టీ నిర్ణయం కోసం కొద్దిరోజులుగా వారు నిరీక్షిస్తూనే ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణ ఈనెల తొమ్మిదో తేదీన ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో చంద్రబాబును కలిశారు. రెండు రోజులు గడిచినా ఇప్పటికీ ప్రకటన రాలేదు. శ్రీకాకుళం, పాతపట్నం అభ్యర్థిత్వాల విషయంలో పార్టీ తన నిర్ణయం మార్చుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఇన్‌ఛార్జీలు భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పోటీ ఖాయం

పార్టీ బి-ఫారం ఇస్తే టిడిపి అభ్యర్థిగా, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగాలని వీరుద్దరూ నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రచారం మొదలుపెట్టారు. శ్రీకాకుళం, పాతపట్నం మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. అభ్యర్థుల మార్పు సమాచారంతో శ్రీకాకుళం, పాతపట్నం ప్రాంతాల్లో ప్రచారం చేయలేదు. గురువారం మాత్రం ఆయన శ్రీకాకుళం నగరంలో ప్రచారం చేశారు. అభ్యర్థుల మార్పు ఉండదన్న సమాచారం ఎంపీకి ఉండొచ్చని గుండ అనుచ రులు భావిస్తున్నారు. అభ్యర్థిత్వాల మార్పు విషయంలో హామీనిచ్చి చివరకు మొండిచేయి చూపడం ద్వారా చంద్రబాబు తమ నేతలను మరోసారి మోసం చేశారని వారు మండిపడుతున్నారు.