ప్రధాని మోదీ అన్ని విషయాల్లో పూర్తి అవగాహనతోనే మాట్లాడతారు.చేసేది తప్పకుండా చెబుతారు. చెప్పింది చేస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ మోదీ ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు. కశ్మీర్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి, వారికి కావాల్సిన ప్రతీ అంశాన్ని తాకిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీ మాత్రమేనని చెప్పక తప్పదు.
ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత సుపరిపాలన
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ న్యూస్ వీక్ పత్రికకు ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత న్యూస్ వీక్ పత్రిక ముఖచిత్రంపై కనిపించిన తొలి భారతీయ నాయకుడు మోదీనే. ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలు ప్రస్తాంచారు. కశ్మీర్ లో అభివృద్ధి, సుపరిపాలన రెండూ సమాంతరంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. కశ్మీర్ అభివృద్ధిని తెలుసుకోవాలంటే అక్కడకు వెళ్లి చూడాల్సిందేనని మోదీ గుర్తుచేశారు. కశ్మీర్ ప్రజలు కొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నారన్నారు. జీ20, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ కార్యక్రమాలకు కశ్మీర్ వేదికైన సంగతిని మోదీ ప్రస్తాపించారు. ఫార్ములా ఫోర్ లాంటి క్రీడాపోటీలను కూడా అక్కడ నిర్వహించామన్నారు. ప్రతీ ఒక్కరూ ఓ సారైనా కశ్మీర్ ను సందర్శించి రావాలని ఆయన కోరారు. కశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసిన తర్వాత అక్కడ డిజిటల్ ఎకానమీ అభివృద్ధి చెందిందన్నారు. స్టార్టప్స్ విపరీతంగా పెరిగాయన్నారు. గతేడాది అక్కడికి రెండు కోట్ల మంది సందర్శకులు వచ్చారన్నారు. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగించే నిరసనలు, రాళ్లు రువ్వే సంఘటనలు ఆగిపోయాయన్నారు.
ఆ బంధం ప్రపంచ శాంతికి అనివార్యం
భారత్ -చైనా సంబంధాలు కూడా న్యూస్ వీక్ పత్రిక ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చాయి. అరుణాచల్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ …. ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ సమస్యలు నెలకొన్నాయని అంగీకరించారు. భారత్ -చైనా మధ్య స్థిరమైన, శాంతియుతమైన సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాయన్నారు. మిలటరీపరంగా, దౌత్యరంగంలో జరుగుతున్న చర్చలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం సాధ్యమేనని ప్రధాని మోదీ ప్రకటించారు. పాకిస్థాన్లో స్నేహాన్ని కోరుకుంటున్నామని, ఆ దేశ అంతర్గత విషయాలపై మాత్రం కామెంట్ చేసే ప్రసక్తే లేదని అన్నారు.
రామాలయ నిర్మాణం సంతృప్తినిచ్చింది…
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టను దేశ ప్రజలందరి ఆకాంక్షగా మోదీ అభివర్ణించారు. రామ జన్మభూమికి లల్లా విగ్రహం చేరుకోవడం ఒక చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు. శతాబ్దాల త్యాగల ఫలితమే ప్రస్తుత రామాలయమని ఆయన వివరించారు. తాను కూడా 11 రోజులు దీక్ష తీసుకున్న తర్వాతే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో మాత్రం ప్రజలు బీజేపీ నేతృత్వ ఎన్డీయే పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటున్నారన్నారు. భారత్ పట్ల కొన్ని దేశాలకు ఉన్న అపోహలు సైతం తొలిగిపోతున్నాయన్నారు.