ఉండి టీడీపీలో చిచ్చు – రఘురామ ఎంట్రీ ఫలితం !

రఘురామకృష్ణరాజు ఎఫెక్ట్ వైసీపీపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో ఆయన ఉండి నుంచి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరింది. అయితే అనూహ్యంగా మరుసటి రోజే పాలకొల్లు నుంచి బయల్దేరుతున్న చంద్రబాబు కాన్వారును ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

పోటీ నుంచి తప్పిస్తే ఇండిపెండెంట్‌గా రామరాజు

నియోజకవర్గంలో మండలస్థాయి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ‘నన్ను పోటీ నుంచి తప్పుకోమంటున్నారు’ అని రామరాజు కన్నీటిపర్యంతమయ్యారు. తాను రాజకీయాల్లో ఉంటే పోటీ చేస్తానని, లేనిపక్షంలో రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని, తన అడుగులు ఎటు అనేది కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రామరాజు స్పష్టం చేశారు. ఇదే జరిగితే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే చర్చ పెద్దయెత్తున సాగుతోంది.

ఇప్పటికే టీడీపీ రెబల్‌గా వేటుకూరి శివ

ఇప్పటికే టిడిపి రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు వెనక్కి తగ్గుతారా లేక పోటీలో కొనసాగుతారా అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే రఘురామకు, మాజీ ఎమ్మెల్యే శివకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ శివ పోటీ నుంచి తప్పుకుని రఘురామ వెంట నడిస్తే రామరాజు బరిలో ఉన్నా వైసిపి, టిడిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. లేనిపక్షంలో రఘురామ టిడిపి అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థులుగా రామరాజు, శివ బరిలో ఉంటే ఆ నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి మూడు గ్రూపులుగా మారి వైసిపికి కలిసొచ్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

టీడీపీ కంచుకోటగా ఉండి నియోజకవర్గం

ఎందుకంటే టిడిపి ఆవిర్భవించాక 1983 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఒక 2004లో మినహా మిగిలిన అన్నిసార్లూ టిడిపి అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009లో కాంగ్రెస్‌, 2019లో వైసిపి గాలి వీచినా ఇక్కడ మాత్రం టిడిపి అభ్యర్థులే గెలుపొందడం దీనికి నిదర్శనం. ఈ క్రమంలో రఘురామ రాకతో టిడిపి చీలికలు పేలికలుగా మారుతోందని ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నర్సింహరాజు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో మంతెన రామరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.