ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తుల సెగ తారాస్థాయికి చేరుకుంది. గతేడాది కిందట జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామనే ముఖ్యమంత్రి హామీని ఉల్ల ంఘించడం, సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ నిరాకరించడం, ఎమ్మెల్యే మేడా, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అనుచరుల మధ్య మొదటి నుంచి పొసగకపోవడం వంటి కారణాలతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నేతలు పార్టీ వీడుతున్నారు.
టీడీపీలో చేరిన మేడా వర్గీయులు
సిట్టింగ్ మేడా మల్లిఖార్జునరెడ్డి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులుగా ముద్రపడిన ద్వితీయశ్రేణి కేడర్ లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. తాజా పరిణామం వైసిపి అభ్యర్థి ఆకేపాటి అమరనాధరెడ్డి గెలుపునకు సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా, జిల్లా పరిషత్ చైర్మన్ అనుచరుల మధ్య సయోధ్య పొసగని నేపథ్యమే కుదుపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాకింగ్‌ను ఇవ్వడం, వెనుకబడిన ఎమ్మెల్యేలను హెచ్చరించడం, తప్పును దిద్దుకునే అవకాశాల్ని కల్పించారు. సిట్టింగ్ ఎమ్మేల్యే మేడా మల్లికార్జునరెడ్డి వెనుక బడినట్లు తేలింది. ముఖ్యమంత్రి రాజంపేట ఎమ్మెల్యేను పలుమార్లు హెచ్చరించారు. సిట్టింగ్ ఎమ్యెల్యే ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాని కారణంగా టికెట్ నిరాకరించారు.
రాజంపేటను జిల్లా కేంద్రం చేయని సీఎం జగన్
ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీనిచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంతో రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి ద్వితీయశ్రేణి కేడర్ రాజీనామాలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజంపేటకు మెడికల్ కళాశాల కేటాయించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మెడికల్ కళాశాల డిమాండ్‌ను సైతం నెర వేర్చిన దాఖలాల్లేవు. ఒంటిమిట్ట మండలం తప్పెట వారిపల్లి, సాలాబాదుల్లో శంకుస్థాపన గోడపత్రంలో పేర్ల నమోదులో మేడా, ఆకేపాటి అనుచరుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. నెల రోజుల కిందట వీరబల్లి మండల నాయకులు ఆకేపాటి అమరనాధరెడ్డికి ఎన్నికల్లో సహకరించే ఇచ్చే ప్రసక్తే లేదనే తేల్చేశారు.
ఆకేపాటి అమరనాథరెడ్డి సహాయనిరాకణ
నియోజకవర్గంలోని మిగిలిన మండలాలైన సుండుపల్లి, నందలూరు, సిద్ధవటం మండలాల కేడర్ నుంచి వైసిపి అభ్యర్థి ఆకేపాటి అమరనాధరెడ్డికి వైసిపి కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండడం చర్చనీయాంశంగా మారింది.టిడిపిలోకి భారీగా చేరికలు సార్వత్రిక పోలింగ్‌కు ముంగిట రాజంపేట పెనుమార్పుకు లోనవుతోంది. రాజంపేట, ఒంటిమిట్ట, సుండుపల్లి, వీరబల్లి మండలాల నుంచి వందలాది మంది వైసిపి క్రియాశీల కార్యకర్తలు టిడిపిలో చేరడానికి సమాయత్తం కావడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ కలవడానికి పెద్దఎత్తున వాహనాల్లో బయల్దేరారు. లోకేష్ సమక్షంలో టిడిపి కండువా వేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది క్రియాశీలక కార్యకర్తలు పార్టీని వీడిన నేపథ్యంలో వైసిపి నాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు కూటమి అభ్యర్థులకు కలసి రానున్నాయి.