కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చి పదేళ్లయ్యింది. ఆదాయంపైనా, అక్రమ సంపాదనపైనా ఎలాంటి ఆపేక్ష లేకుండా ప్రతీ బీజేపీ ఎంపీ పనిచేశారు. తమకు ఎలాంటి ఆదాయం అవసరం లేదని, ప్రజల ఆదాయాలు పెంచడమే తమ ధ్యేయమంటూ వాళ్లు దేశం కోసం అహర్నిశలు కృషి చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటి మంచి పనులు చేసినట్లుగా కనిపించడం లేదు. సొంత సంపదను పెంచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విజృంభించారు. అందుకే అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే ఠక్కున కాంగ్రెస్ నేతల పేర్లే గుర్తుకు వస్తున్నాయి….
నకుల్ నాథ్ సంపద రూ. 716 కోట్లు..
కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్. పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు ఆయన .ఇప్పుడు మరోసారి ఛింద్వారా లోక్ సభా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్ సభకు తొలి దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అయనే రిచ్చెస్ట్ కేండేట్. ఆయన స్థిరాస్తి రూ. 668 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ప్రకారం తొలిదశ అభ్యర్థుల్లో 450 మంది అంటే 28 శాతం కోటీశ్వరులున్నారు. నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి అయితే, తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థికి సంపన్నుల జాబితాలో రెండో స్థానం దక్కింది. అతని సంపద రూ.662 కోట్లు . తమిళనాడులోని శివగంగ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవనాథ్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద రూ. 500 కోట్ల పైమాటే….
నేరచరితులు కూడా ఎక్కువే..
భీమ్ ఆర్మీగా పిలిచే ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పై ఏకంగా 36 క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ఉత్తర ప్రదేశ్లోని నగీనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న జరిగే తొలి దశ పోలింగ్ లో 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. రెడ్ అలెర్ట్ సీట్స్ అంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది నేరచరితులు ఉన్న నియోజకవర్గాల్లో అందులో 42 ఉన్నాయని ఏడీఆర్ తేల్చింది.తొలి దశలో 1,625 మంది అభ్యర్థులు ఉండగా, 1,618 మంది తమ వివరాలు ఇచ్చారు. 252 మందిపై కేసులుండగా అందులో 161 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. తమిళనాడులో ఒక అభ్యర్థిపై రేప్ కేసు ఉంది. మొత్తం 35 మందిపై విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయి. దాదాపు 15 శాతం మంది అభ్యర్థులు నేరచరితులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మహిళలకు ప్రాధాన్యం తక్కువే..
మహిళా రిజర్వేషన్ కు అన్ని పార్టీలు ఓటేశాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు బాకాలు ఊదుకుంటున్నాయి. మహిళలకు టికెట్లు ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. పోటీలో 1,483 మంది పురుషులుంటే 135 మంది మాత్రమే మహిళలున్నారు. ఆ సంఖ్య 33 శాతం ఎలా అవుతుందని పార్టీలే సమాధానం చెప్పాలి…