సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి రూపాయి ఖర్చుకు అభ్యర్థులు లెక్కలు చూపాలి. దీన్ని తేలిగ్గా తీసుకుంటే గెలిచినా, తర్వాత పదవి కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చూ రోజువారీ పద్దుల పుస్తకంలో నమోదు తప్పనిసరి. అభ్యర్థుల పేరుతో బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాల్సి ఉంటుంది. పారదర్శకంగా లెక్కలు చూపేందుకు దేనికి ఎంత ఖర్చు చేయాలన్న ధరలను ఎన్నికల సంఘమే నిర్ణయించింది. దీన్ని ప్రామాణికంగా తీసుకుని సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, ర్యాలీలు, ఇతరాల ప్రతి ఖర్చుకూ లెక్కలు చూపక తప్పదు.
ఖర్చు పరిమితి
లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. దీనికి లోబడే ఖర్చు ఉండాలి. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. మద్యం, నగదు, కానుకల పంపిణీని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తారు. ఇందుకోసం ఇసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున సహాయ వ్యయ పరిశీలకులను, పార్లమెంట్ స్థానానికి సంబంధించి అన్ని విభాగాలను పరిశీలించేందుకు మరో ఎనిమిది మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది.ఖర్చుల లెక్కలు ఎలా..?ప్రచారంలో భాగంగా రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసే మైకు దగ్గర నుంచి బ్యానర్ల వరకు, కార్యకర్తలకు ఇచ్చే తేనీరు, నీటి బాటిల్ నుంచి భోజనం వరకూ అన్నింటికీ నమోదు చేయాల్సిన ధరల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
అదనపు వ్యయం చేస్తే చిక్కులే
సామర్థ్యం, మరికొన్నింటికి కొలతల వారీగా ఈ ధరలను నిర్ణయించారు. సామర్థ్యం ప్రామాణికంగా రూ.1,200 నుంచి రూ.ఐదు లక్షల వరకు సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. చదరపు అడుగు ఎల్ఇడి వాల్స్‌కు రూ.342 వరకు అనుమతిస్తారు. కళ్యాణ మండపానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, టన్ను ఎసికి రూ.4 వేలు, ఎయిర్ కూలర్లకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించవచ్చు. ఎన్నికల ప్రచారమన్నాక బ్యానర్లు, బ్యాడ్జీలు, జెండాలు, పోస్టర్లు, అనుచరులకు అల్పాహారాలు, భోజనాలు, తప్పవు. వీటిలో ప్రతి అంశమూ వ్యయ పరిమితికి లోబడే ఉండాలి. పార్టీ గుర్తు ఉన్న ప్రతి వస్తువుకూ నిర్ణీత ధర ప్రకారమే పద్దు రాయాలి. సాధారణ కుర్చీకి రూ.5 నుంచి రూ.20, స్టీలు కుర్చీకి రూ.100, మహారాజా సోఫాకు రూ.1,500, షామియానాలకు రూ.800 నుంచి రూ.10 వేలు, మినీ జనరేటర్‌కు రూ.3,500, 125 కెవి జనరేటర్‌కు రూ.20 వేలకు మించకూడదు. 200 గ్రాముల పులిహోర, ప్లేట్ ఉప్మా , దోశలకు రూ.30 వంతున లెక్కించాలి.
ప్రచారంలో పాల్గొనే కూలీల ఖర్చూ చూపాల్సిందే !
ప్రచారంలో నిర్వహించే ర్యాలీల్లో ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు కూలీలు పాల్గొంటారు. వీరు సభా ప్రాంగణాల ఏర్పాటుకే పరిమితం కారు. వందల సంఖ్యలో జనసమీకరణ జరగాలంటే అందుకు కొంత వ్యయం భరించాల్సిందే. ఈ ఖర్చును వారి కూలిగా చూపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. బైక్‌కు ఐదు లీటర్ల పెట్రోల్‌కు రూ.550, ఎద్దుల బండికి రూ.1,500, నైపుణ్యం లేని కార్మికులకు రూ.519 నుంచి రూ.649 వరకు, మోస్తరు నైపుణ్యమున్న వారికి రూ.621 నుంచి రూ.776 వరకు, నిపుణులకు రూ.741 నుంచి రూ.926, అతి నైపుణ్యమున్న వారికి రూ.1,046 నుంచి రూ.1,059 వరకు చెల్లించాలని ఇసి సూచించింది. ప్రస్తుత ధరలు, డిమాండ్‌ను బట్టి ఇంతకంటే అధికంగానే చెల్లించినా ఈ మేరకు మాత్రమే వారు ఇసికి సమర్పించే వ్యయ నివేదికల్లో పొందుపరచాల్సి ఉంటుంది.