ఆనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ మనసు మార్చుకుంది. మొదట్లో ఆ సీటును అడగకపోయినా బీజేపీకి ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ స్థానాన్ని వెక్కి ఇచ్చేస్తే… తంబళ్ల పల్లె నియోజకవర్గం ఇస్తామని ప్రతిపాదన పెట్టింది. దీనిపై బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మార్చడం ఎందుకన్న వాదన సీనియర్లలో వినిపిస్తోంది.
ఆనపల్లిలో నల్లమిల్లిని బుజ్జగించలేకపోయిన చంద్రబాబు
ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు బుజ్జగించలేకపోయారు. ఆయన రోజు రోజుకు రాజకీయ కార్యక్రమాలు పెంచుకుంటూ పోయారు. చివరికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీలోకి వస్తే టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారని కూడా ప్రచారం చేయించుకున్నారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు.చివరికి ఆయన కోసం తంబళ్ల పల్లె ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
ప్రచారం చేసుకుంటున్న టీడీపీ అభ్యర్థి
తంబళ్లపల్లె నియోజకవర్గానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దాసరిపల్లె జయచంద్రారెడ్డిని ఇది వరకే ప్రకటించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయన బలమైన అభ్యర్థి కాలేకపోతున్నారన్న భావన పెరిగిపోయింది. రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో .. మరో బీజేపీ అభ్యర్థి నియోజకవర్గంలో నిలబడినా అభ్యంతరం లేదన్న వాదన వినిపించిది. అందుకే ఆనపర్తి – తంబళ్లపల్లె మార్పు విషయంలో కొంత సానుకూలత ఉందని భావిస్తున్నారు.
తంబళ్లపల్లెలో బీజేపీకి మంచి క్యాడర్
తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీజేపీకి మంచి క్యాడర్ ఉంది. సీనియర్ నేత చల్లపల్లె నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి పని చేశారు. ఎలాంటి పొత్తులు లేని సమయంలో కూడా ఆయన 2009లో తంబళ్లపల్లెలో పోటీ చేసి ఇరవై వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. ఈ సీటును బీజేపీ.. పదకొండో సీటుగా కేటాయించాలని పట్టుబట్టింది. కానీ సీట్ల మార్పిడికి టీడీపీ ప్రతిపాదన పెట్టింది.