ఆలయం అంటేనే..వేకువజామునే పూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాల తలుపులు మూసేసి..మళ్లీ గ్రహణం పూర్తైన తర్వాత శుద్ధి చేసి పూజలు చేస్తారు. అయితే ఓ ఆలయం మాత్రం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే…అది కూడా రాత్రి సమయంలో మాత్రమే తెరుస్తారు…ఎందుకలా?
సర్పంపై శంకరుడు
మధ్యప్రదేశ్ ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం రెండో అంతస్తులో శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పూర్వం మాల్వా రాజ్యానికి చెందిన పర్మార్ రాజు భోజ్ అనే రాజు దాదాపుగా 1050 ఏడీలో నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ ఆలయ నిర్మాణం తర్వాత 1732లో సింధియా కుటుంబానికి చెందిన మహారాజ్ రాణోజీ సింధియా మహాకాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11 వ శతాబ్దానికి చెందిన ఓ ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని శివపార్వతులు కూర్చుని ఉంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. ఎందుకంటే సాధారణంగా సర్పంపై విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి వినాయకుడు కూడా కొలువై ఉంటాడు.
తక్షకుడికి వరమిచ్చిన శివుడు
సర్పరాజు తక్షకుడు శివుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడు. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయట.
ఈ ఆలయాన్ని ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు. అది కూడా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చతుర్థి తిథి రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి నాగపంచమి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తెరుస్తారు. ఈ సమయంలో మాత్రమే భక్తులు నాగేంద్ర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయాన్ని అర్ధరాత్రి తెరిచినప్పటికీ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం.
గమనిక: పుస్తకాల నుంచి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..