రాజకీయాలకు సినిమా పరిశ్రమకు విడదీయరాని సంబంధముంది. అమెరికాలో రోనాల్డ్ రీగన్ అయినా,భారత్ లో సునిల్ దత్, వైజయంతిమాలా బాలీ, ఎంజీఆర్,ఎన్టీయార్, కృష్ణ,చిరంజీవి, పవన్ కల్యాణ్ అయినా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో రాణించిన వారే. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యమిచ్చిన వాళ్లే. సంప్రదాయ రాజకీయ నాయకులతో పోటీ పడి మరీ ప్రజాసేవ చేసిన సినీ దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. నిస్వార్థంగా, నిక్కచ్చగా పనిచేసిన సినీ ప్రముఖులను ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటున్నారు…
షిండేతో గోవిందా భేటీ…
1990ల్లో బాలీవుడ్ పరిశ్రమను ఏలిన గోవిందా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సమక్షంలో ఆయన అధికార శివసేనలో చేరారు. షిండేదే నిజమైన శివసేన అని కోర్టు ప్రకటించిన తర్వాత ఆయన పార్టీలో చేరిన తొలి సినీ దిగ్గజం కూడా గోవిందానే కావచ్చు. హీరోగా కామెడీ డైలాగ్స్ ను ప్రచుర్యం చేసిన కథానాయకుడు గోవిందా. తన డ్యాన్స్ తో యువతను ఉర్దూతలూగించిన హీరో కూడా ఆయనే కావచ్చు. ఇప్పటికీ గోవిందా డ్యాన్ ఒక సిగ్నేచర్ స్టెప్ .అందుకే గోవిందా మళ్లీ రాజకీయాల్లో రాణించడం సాధ్యమేనన్న టాక్ వచ్చింది..
గతంలో కాంగ్రెస్ ఎంపీ..
2000 సంవత్సరం ప్రాంతంలో గోవిందా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో శివసేన వైతాళికుడు రామ్ నాయక్ ను ఆయన ఓడించి చరిత్ర సృష్టించారు. 2009 వరకు పదవిలో కొనసాగి..తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎంపీగా చేసినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోే ఉండేవారు. ఇప్పుడు పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. గోవిందాకు అంటూ ఒక ఫోలోయింగ్ ఉండటంతో మళ్లీ రాణించడం కష్టమేమీ కాదన్న టాక్ నడుస్తోంది..
ఈ సారి ఎక్కడ నుంచి …
కేంద్రంలో ప్రధాని మోదీ, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారని గోవిందా ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో రామరాజ్యాన్నిచూస్తున్నామని, ఆ రామరాజ్యంలోనే తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని గోవిందా చెప్పుకున్నారు. షిండే పాలనలో ముంబై అందమైన నందనవనంగా తయారైందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని గోవిందా కితాబిచ్చారు. గోవిందా బేషరత్తుగా శివసేనలో చేరారని ఏక్ నాథ్ షిండే చెబుతున్నా.. ఆయనకు వాయువ్య ముంబై లోక్ సభా స్థానం కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. సాంస్కృతిక, కళా రంగాల్లో సేవ చేసేందుకే తాను శివసేనలో చేరానని,ఆ దిశగా ఎలాంటి బాధ్యత అప్పగించినా ఆనందంగా స్వీకరిస్తానని గోవిందా ప్రకటించారు. మరి మోదీ, షిండే ఆయన కోరికను మన్నిస్తారో లేదో చూడాలి. కేంద్రంలో ఏదైనా పదవి దక్కుతుందా లేదా వేచి చూడాలి..