క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు అలాగే ఉండిపోలేదు..కమెడియన్ల క్యారెక్టర్లకే పరిమితం అయిపోలేదు. హీరో ఎవరైనా కానీ కథలో తమకంటూ ప్రత్యేకత ఉన్న పాత్రల్లో నటిస్తూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆ ఇద్దరు. వాళ్లెవరో కాదు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ…
ప్రేక్షకుల ఆలోచనలో మార్పొచ్చింది. హీరో ఎవరు – డైరెక్టర్ ఎవరన్నది కాదు..సినిమా స్టోరీ బావుందా లేదా అన్నదే ఫైనల్. కథ బావుంటే అందులో హీరో ఎవరైనా కానీ ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఏ సినిమాలో అయినా హీరోనే ప్రధానం. తన చుట్టూనే స్టోరీ నడిచేది… హీరో పక్కన ఉండే ఇద్దరు ముగ్గురు స్నేహితులు మధ్యమధ్యలో సపోర్టింగ్ రోల్ చేసేవారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ వీళ్లిద్దరి విషయంలో మాత్రం ఆ లెక్కలు మారిపోయాయ్. హీరోకి ఫ్రెండ్ గా మాత్రమే కాదు కథని మలుపు తిప్పే క్యారెక్టర్స్ వాళ్లకోసం డిజైన్ చేస్తున్నారు. ఆ ఇద్దరై ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ…
ప్రియదర్శి ఒక పక్క సోలో సినిమాలు చేస్తూనే మరోవైపు హీరో పక్కన కథలో ఇంపార్టెన్స్ ఉండే పాత్రలో సత్తాచాటుకుంటున్నాడు. అది కూడా కథలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ కూడా స్టోరీలో ఆద్యంతం తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నవ్వులు పూయించిన రాహుల్..భరత్ అనే నేను లో రాజకీయాల్లోకి అడుగుపెట్టే యువతగా సీరియస్ క్యారెక్టర్లో మెప్పించాడు. ఇంకా హుషారు, జాతిరత్నాలు సహా తను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన పాత్ర ఉండేలా చూసుకున్నాడు. ప్రియదర్శి కూడా ఓ వైపు ఫ్రెండ్ గా మెప్పిస్తూనే మరోవైపు బలగం లాంటి సూపర్ హిట్ మూవీలో నటించాడు. నటనలో తమకంటూ సర్కిల్స్ వేసుకుని కూర్చోకుండా…వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ దూసుకెళుతున్నారు…
తాజాగా మరోసారి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలసి కనిపించిన సినిమా ఓం భీం బుష్. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. శ్రీ విష్ణుతో పాటు కథలో కీలకంగా మారిన రాహుల్, ప్రియదర్శి పాత్రలకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఆ ఇద్దరు లేకుండా శ్రీ విష్ణు ఒక్కడే నడిపించడం అన్నది కుదిరే పని కాదు. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు వాళ్లిద్దరూ నటించిన ప్రతి సినిమాలోనూ కథలో బలమైన పాత్రలుగా మారుతూ సత్తా చాటుకుంటున్నారు.