ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి!

అనారోగ్య సమస్యలు ఒకప్పుడు వయసు పైబడిన తర్వాత వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. అన్ని రకాల అనారోగ్య సమస్యలు దాడి చేస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణం అవుతోంది. ఇలాంటి సమస్యల్లో ఒకటి హార్మోన్స్ హెచ్చుతగ్గులు.
హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఉన్నాయంటే థైరాయిడ్ బారిన పడతారు. అందుకే ముందుగా అప్రమత్తం అవండి..ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు

వయసు పెరుగుతున్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌ లెవల్స్‌ తగ్గడాన్నే హైపో థైరాయిడిజమ్‌ అంటారు. పరీక్షలు చేయించుకోకపోతే ఈ హైపో థైరాయిడిజమ్‌ ఉన్నట్టు కూడా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే అందుకు ప్రధాన కారణం. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపకశక్తి, విషయ గ్రహణ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. అధిక బరువు, మగత, పొడి చర్మం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని చాలావరకు వృద్ధాప్య సంబంధ మార్పులుగా భావిస్తుంటారు. కానీ వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

హైపోథైరాయిడిజం లక్షణాలు ఇలా ఉంటాయి

@ థైరాయిడ్‌ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించలేదు. దాంతో రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.

@ హైపో థైరాయిడిజమ్‌ వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంది. నెమ్మదిగా నడుస్తుంటారు. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది.

@ థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. దాంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణమైన ఆహారం విసర్జితమవడం కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది.

@ కొంతమందిలో ఒళ్లు నొప్పులు ఒక్కటే థైరాయిడ్‌ సమస్యకు సంకేతం కావొచ్చు. హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం తగ్గుతుంది. దాంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతుంటాయి.

@ తక్కువ వయసులో థైరాయిడ్‌ పనితీరు తగ్గిన వారిలో డిప్రెషన్‌ ఉండటం ఎక్కువగా చూస్తుంటాం. ఏదీ ఎక్కువసేపు జ్ఞాపకం ఉండకపోవడం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం లాంటివి కూడా హైపో థైరాయిడిజమ్‌ లక్షణాలు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయ అవగాహనలో థైరాయిడ్‌ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.