పాతకాపులే కాంగ్రెస్ కు దిక్కా..?

కాంగ్రెస్ పార్టీ పాత పోకలను పోగొట్టుకోలేకపోతోంది.అన్ని పార్టీలు మార్పును కోరుకుంటుంటే…కాంగ్రెస్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది. ఎన్నికల పోటీలో బీజేపీ సరికొత్త ప్రయోగాలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇదిగో ఇక్కడే ఉంటామన్నట్లుగా ఎలాంటి మార్పుకు అవకాశం లేని పాత్రను పోషిస్తోంది.కాలం చెల్లిన నేతలను వెదికి మరీ టికెట్లిస్తోంది. ఎక్కడా యువతను ప్రోత్సహించిన దాఖలాలు కనిపించడమే లేదు…

దిగ్విజయ్ సింగ్, కార్తీ చిదంబరానికి నామినేషన్

కాంగ్రెస్ పార్టీ రోజుకో జాబితా ప్రకటిస్తున్నా అందులో కొత్తదనమేమీ కనిపించడం లేదు. దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని వేలాడుతూ కాంగ్రెస్ ను కృంగదీసిన వారికే మళ్లీ టికెట్లు ఇస్తోందీ ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. కాంగ్రెస్ నాలుగో జాబితాలో దిగ్విజయ్ సింగ్, కార్తీ చిదంబరం పేర్లు కనిపించడంతో రాజకీయాల్లో ఒక రకమైన విస్మయం తప్పడం లేదు. ఇంకా వాళ్లకు ఎన్నికల రాజకీయాలు అవసరమా అన్న ప్రశ్నలు సహజనంగానే తలెత్తుతున్నాయి..

దిగ్విజయ్ పట్ల తీవ్ర వ్యతిరేకత…

దిగ్విజయ్ సింగ్ అప్పుడెప్పుడో ఉమ్మడి మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన హయాంలోనే పార్టీ ఓడిపోయింది. తర్వాత పుంజుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీకి ఒరిగించిందేమీ లేదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి దాన్ని మరికాస్త జటిలం చేస్తుంటారాయన. మధ్యప్రదేశ్లో ఆయన గ్రూపులు కట్టడం వల్లే చాలా మంది బయటకు వెళ్లిపోయి బీజేపీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ దిగ్విజయ్ శల్య సారథ్యం వహించారన్న ఆపవాదూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నికల్లో గెలిచింది కూడా లేదు. అలాంటి నేతకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్ ఘర్ స్థానాన్ని కేటాయించింది. శతాబ్దాల క్రితం దిగ్విజయ్ కు చెందిన రాజకుటుంబం ఆ ప్రాంతాన్ని పాలించి ఉండొచ్చు. ఇప్పుడు రాచరికాలు పోయి ప్రజారాజ్యాలు వచ్చిన తర్వాత కూడా వారినే పట్టుకుని వేలాడటం కరెక్టు కాదని కాంగ్రెస్ కు తెలియనిది కాదు. పైగా దిగ్విజయ్ సింగ్ ఇలాకాలో బీజేపీ జెండా పాతేసి చాలా రోజులైంది. అక్కడో యువ నాయకుడికి అవకాశం ఇస్తే పార్టీ గెలిచినా ఓడిపోయినా సంస్థాగతంగా అభివృద్ధికి అవకాశం ఉండేదన్న వాదన కాంగ్రెస్ పెద్దలకు చేరిందో లేదో…

స్కాముల కార్తీకి టికెట్…

కార్తీ చిదంబరం కాంగ్రెస్ పార్టీలో కుటుంబ వారసత్వంగా వచ్చిన నాయకుడు. తండ్రి పళణియప్పన్ చిదంబరం కేంద్ర హోం, ఆర్థిక శాఖలను నిర్వహించారు. రాజకీయంగా మంచి క్లౌట్ ఉన్న నాయకుడు. కార్తీ తల్లి నళిని చిదంబరం లీడింగ్ లాయర్. వాళ్ల పేరు చెప్పుకుని రాజకీయం చేసే కార్తీ తండ్రి చిదంబరం ప్రాతినిధ్యం వహించిన తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచే వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే పుణ్యమాని గెలిచిన కార్తీ.. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నంలో ఉన్నారు. కార్తీపై అరడజను కేసులున్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. తప్పుడు కేసులు బానాయించి ఇబ్బంది పెడుతున్నారని బీజేపీని తిట్టిపోసే కాంగ్రెస్ పార్టీకి కార్తీ అవినీతిపై అవగాహన లేదని చెప్పలేం. చైనా పౌరులకు భారత వీసాలు ఇప్పించేందుకు కార్తీ యాభై లక్షల రూపాయలు లంచం పుచ్చుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఐనా చిదంబరం ఇన్ ఫ్లుయెన్స్ తో కార్తీ టికెట్ పొందారని చెబుతున్నారు. అదే కొత్తవారికి అవకాశం ఇస్తే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ బతికేది. కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే పంచన చేరి బతకాలనుకుంటున్నారు….