అడ్డంగా చిక్కిపోయి అరెస్టయిన కేజ్రీవాల్… కారణాలేమిటో..?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన అధికారులు కాసేపు ఆయన్ను ప్రశ్నించి అరెస్టును ప్రకటించారు. అయన్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు ప్రకటించడం కూడా విశేషమే.

కవిత అరెస్టు ఇచ్చిన సంకేతం…

గత వారం కల్వకుంట్ల కవిత అరెస్టుతో కేజ్రీవాల్ విషయంలో కూడా ఈడీ చాలా వేగంగా కదులుతుందని అర్థమైంది. కవిత ఇన్వెస్టిగేషన్ రిపోర్టు కూడా అందులో కీలకమవుతుంది. కవితతో పాటు సౌత్ గ్రూపులోని కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలక భూమిక వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ గ్రూపులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముడుపులు పుచ్చుకుని లిక్కర్ పాలసీని సౌత్ గ్రూపుకు అనుకూలంగా మార్చారు. కవిత నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు అందినట్లు కూడా ఈడీ, సీబీఐ గుర్తించాయి. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను, కేజ్రీవాల్ ను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.అప్పుడు మరిన్ని కీలకాంశాలు వెల్లడవుతాయని ఎదురు చూస్తున్నారు…

తొమ్మిది సమన్లను ధిక్కరించిన సీఎం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం మేరకు ఈడీ తమపై కేసులు పెడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. అవి నిరాధారమైన ఆరోపణలని కూడా తేలిపోయింది. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే దర్యాప్తు సంస్థ సమన్ల జారీ చేసింది. విచారణకు రాకపోవడంతో అరెస్టులకు తెరతీసింది. మొత్తం తొమ్మిది సార్లు కేజ్రీవాల్ … ఈడీ సమన్లకు స్పందించలేదు. తొలుత సమన్ల చట్ట విరుద్ధమని ప్రకటించిన కేజ్రీవాల్, తర్వాతి కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రకటించారు. ఏ హోదాలో తనను విచారణకు పిలుస్తున్నారో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దానితో ఆప్ కన్వీనర్ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. అందుకే కేజ్రీవాల్ అరెస్టుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వెనుకాడలేదు…

కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు

ఈడీ తాజా ఛార్జ్ షీటులో సౌత్ గ్రూపు బ్యాచ్ తో కేజ్రీవాల్ ఫేస్ టైమ్ సంప్రదింపులను ప్రస్తావించింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుతో మాట్లాడుతూ విజయ్ నాయర్ తో తనకున్న అనుబంధాన్ని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇంఛార్జ్ అయిన విజయ్ నాయర్.. లంచాల పంపిణీలో సౌత్ గ్రూపుకు, ఢిల్లీ బ్యాచ్ కు మధ్యవర్తిగా వ్యవహరించారు. క్విడ్ ప్రోకో లావాదేవీలకు వీలు కలిగే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. కవితకు, సౌత్ గ్రూపుకు ప్రయోజనం కలిగించే విధంగా లిక్కర్ పాలసీని రూపొందిస్తే రూ. 100 కోట్ల చెల్లించేందుకు అంగీకరించినట్లు అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాగ్మూలం కేజ్రీవాల్ ను,కవితను ఫిక్స్ చేసేసింది..