దేశం ప్రగతిపైనా, శాంతిభద్రతల సంరక్షణపైనా ఆలోచన చేసే వాళ్లంతా ఇప్పుడు ఒక వైపే చూస్తున్నారు. ఎలాగైనా ఆ కూటమితోనే జతకట్టాలనుకుంటున్నారు. అదే బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమి. దేశాన్ని సుభిక్షంగా ఉంచే సత్తా ఆ ఒక్క కూటమికే ఉందని, దానికి నాయకత్వం వహించే మోదీకి మాత్రమే ఉందని పార్టీలు ఒక్కటొకటిగా నిర్ధారణకు వస్తున్నాయి. తమిళనాడులో ఓ మోస్తరు బలమైన శక్తిగా భావించే పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీతో జత కట్టేందుకు పోటీ పడుతున్నాయి….
ఇదిగో వచ్చేస్తున్నానంటున్న పీఎంకే…
పాటాలి మక్కల్ కట్చి (పీఎంకే) తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే పార్టీ. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ రాందాస్ స్థాపించిన పీఎంకేను ఇప్పుడు ఆయన కుమారుడు అణ్బుమణి రాందాస్ నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ పీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్న చర్చ జరుగుతూనే ఉంది. పీఎంకే ప్రతినిధులు ఒక వైపు అన్నాడీఎంకే మరో వైపు బీజేపీతో చర్చలు జరుపుతూ వచ్చారు. సుదీర్ఘ చర్చలు, సమీక్షల తర్వాత అన్నాడీఎంకే కంటే బీజేపీ బెటరని పీఎంకే పెద్దలు డాక్టర్ రాందాస్, అణ్బుమణి నిర్ణయించారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేతో జతకట్టి పోటీ చేయాలని వారిద్దరూ తీర్మానించారు..దీనితో సస్పెన్స్ కు తెరపడినట్లయ్యింది…
కార్యవర్గంలో చర్చించిన తర్వాతే….
పొత్తులపై పీఎంకే కార్యవర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా కార్యదర్శులు ఒక్కొక్కరితో పార్టీ నాయకత్వం మాట్లాడింది. కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు వల్ల తమకు,తమిళనాడుకు జరిగే ప్రయోజనాలను అగ్రనేతలు వారికి వివరించారు. విశాల జనహితం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని, మోదీ పాలన తమిళనాడుకు కూడా మేలు కలిగిస్తుందని అణ్బుమణి రాందాస్ ప్రకటించారు. ఉత్తర తమిళనాడులో పీఎంకేకు మంచి సపోర్టు ఉంది. పడమటి జిల్లాల్లోనూ పార్టీకి బలమైన కేడర్ ఉంది. అది ఎన్డీయే పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని డాక్టర్ రాందాస్ అభిప్రాయపడ్డారు. తమకు కూడా కొన్ని లోక్ సభా స్థానాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో వ్యవసాయ సామాజికవర్గమైన వన్నియర్ కుల ప్రయోజనాలను కాపాడేందుకు 1989లో డాక్టర్ రాందాస్ పీఎంకేను స్థాపించారు. ఒకప్పుడు వాజ్ పేయి నేతృత్వ ఎన్డీయేలో ఉన్న పీఎంకే కేంద్రప్రభుత్వంలో కూడా భాగమైంది. అణ్బుమణి రాందాస్ , కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు పొగాకు నిషేధాన్ని అమలు చేశారు. పీఎంకే ప్రతినిధులు రైల్వే, పెట్రోలియం శాఖలను కూడా నిర్వహించారు.
అన్నాడీఎంకే పరిస్థితేమిటి…?
ఒకప్పుడు అన్నాడీఎంకే కూడా ఎన్డీయేలో ఉండేది. తర్వాత రూటు మార్చింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వైఖరి నచ్చలేదని చెబుతూ పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే.. ఎన్డీయే నుంచి వైదొలిగింది. పీఎంకే తమతో జతకడితే కొన్ని లోక్ సభా స్థానాలు వస్తాయని అన్నాడీఎంకే విశ్వసించింది. ఇప్పుడు సీన్ మారిపోయి పీఎంకే వెళ్లి ఎన్డీయేలో చేరడంతో అన్నాడీఎంకే పరిస్థితి ఆగమ్యగోచరమైంది.మరి ఇప్పుడు ఎన్డీయేలో చేరాలా వద్దా అన్నది అన్నాడీఎంకే నేతలే నిర్ణయించుకోవాలి. టైమ్ చాలా తక్కువుంది. ఎందుకంటే తమిళనాట ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి…