రాష్ట్రాల వారీగా బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి. 400 పార్ అంటే కనిష్టంగా 400 లోక్ సభా స్థానాలు అన్న ప్రధాని మోదీ ఆలోచన నిజమవుతుందా అన్న ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తోంది. బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ఎదురుండదని కూడా అవే సర్వేలు నిగ్గు తేల్చుతున్నాయి….
ఇక ప్రభంజనమేనంటూ బీజేపీ హర్షం
రిపబ్లిక్ కన్నడ – పీ మార్క్ కలిసి ఓ సర్వే నిర్వహించాయి. దాని ప్రకారం కర్ణాటకలో ఉన్న 28 లోక్ సభా స్థానాల్లో ఎన్డీయేకు 25 నుంచి 27 స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. బీజేపీ 25 చోట్ల పోటీ చేసి, తాజా పొత్తు భాగస్వామి జేడీఎస్ కు 3 సీట్లు వదిలెయ్యాలని భావిస్తోంది. ఈ సందర్భంలోనే పొత్తుకు 27 స్థానాల వస్తాయని రిపబ్లిక్ కన్నడ ప్రకటించింది. జేడీఎస్ మిత్రపక్షంగా మారడం వల్ల పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి ఓటర్ల మద్దతు బాగా పెరుగుతుందని తేల్చేశారు.
కనిష్టంగా 56 శాతం ఓట్లు..
సర్వే ప్రకారం కర్ణాటకలో ఎన్డీయేకు 56 శాతం ఓట్లు రావడం ఖాయమైంది. గత ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఈ సారి 38 శాతం ఓట్లు వస్తాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 52 శాతం, కాంగ్రెస్ కు 32 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి ఇతరులకు ఆరు శాతం వరకు ఓట్లు వస్తాయని సర్వే ప్రకటించింది…
సామాజిక వర్గ సమీకరణాలు సైతం బీజేపీ వైపు….
భారత్ ప్రజల ఓటింగ్ సరళిలో సామాజిక వర్గ సమీకరణాలు ప్రధాని భూమి పోషిస్తాయి. ఈ సారి కర్ణాటకలో కూడా అదే జరుగుతుందని సర్వే చెబుతోంది. బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలకు తలో సామాజికవర్గ బలం ఉంది. బీజేపీకి నిరంతరాయంగా లింగాయత్ మద్దతు లభిస్తోంది. లింగాయత్ సామాజికవర్గంలో 67 శాతం మంది బీజేపీకి ఓటేయ్యబోతున్నారు. ఉత్తర కర్ణాటక, బోంబే – కర్ణాటక ప్రాంతాల్లో వారి బలం ఎక్కువగా ఉంటుంది.వారితో పాటు ఓబీసీలు, ఒక్కళిగలు కూడా బీజేపీ వైపుకు వచ్చే అవకాశం ఉంది. జేడీఎస్ ప్రధానంగా ఒక్కళిగల పార్టీగా చెబుతారు. వాళ్లకు పాత మైసూరు ప్రాంతంలో ఎక్కువ ఓటర్లున్నారు. ఈ సారి ముస్లింలు, కురుబలు, ఎస్సీలు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. ఐనా సరే బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమికి 27 సీట్లు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఆ కూటమికి తిరుగులేదని తేలిపోయింది…