అసెంబ్లీ సాక్షిగా రెండు పార్టీల కొట్లాట…

అది రెండు పార్టీల అపవిత్ర కలయిక అని జనం ఎప్పుడో డిసైడయ్యారు. ఇండియా గ్రూపు పేకమేడలా కూలిపోతుందని బీజేపీ ఏనాడో జోస్యం చెప్పింది. జనమూ, ప్రత్యర్థి పార్టీలు ఊహించినట్లుగానే కొట్లాటలు జరుగుతున్నాయి. రాజకీయ వేదికల మీద, వీధుల్లో, చివరకు అసెంబ్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోరంగా తగవులాడుకుంటున్నాయి. తెగదెంపుల దిశగా అడుగులు వేస్తున్నాయి..

మాన్, బజ్వా మాటల యుద్ధం

పేరుకే మిత్రపక్షాలు, వాస్తవానికి ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఆప్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీలైతే పక్కనోడిని మింగెయ్యాలన్న ఆత్రుత రెండు పార్టీల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ లో కత్తులు దూస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీలో ఇప్పుడు హై డ్రామా నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కాంగ్రెస్ కు చెందిన ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మధ్య మాటా మాట పెరిగింది దమ్ముంటే ఆప్ కు ఢిల్లీ, హరియాణా, గుజరాత్లో సీట్లివ్వకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ ను మాన్ సవాలు చేశారు. సోనియా, రాహుల్ తమతో మాట్లాడుతున్నారంటే, కలిసి కూర్చుంటున్నారంటే అది తమ గొప్పదనమేనని మాన్ చెప్పుకున్నారు.పంజాబ్ లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తీరుపై మాన్ మండిపడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకురావడంపై అభ్యంతరం చెప్పారు…

13 చోట్ల ఆప్ పోటీ..

పంజాబ్లోని 13 లోక్ సభా స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భగవంత్ మాన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ బరిలోకి దిగేందుకు తాను రెడీగా ఉన్నానని బజ్వా సవాలు చేశారు. దమ్ముంటే తన మీద పోటీ చేయాలని మాన్ కూడా ఆయన్ను రెచ్చగొట్టారు. ముఖ్యమంత్రి ప్రవర్తన అనైతికంగా, అప్రజాస్వామికంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఒక కవర్లో అసెంబ్లీ తాళాలు పట్టుకొచ్చి స్పీకర్ కు ఇచ్చిన సీఎం మాన్.. కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లకుండా తాళాలు వేయాలని సూచించారు…

గోవా, పంజాబ్ లో ఒంటరి పోరు..

ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకున్నాయి. అక్కడ మొత్తం ఏడు స్థానాలుండగా ఆప్ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. హరియాణా, గుజరాత్లో కూడా సీట్ల సర్దుబాటు ఖరారైంది. అయితే పంజాబ్లో మాత్రం స్థానిక ఆప్ నేతలు ఒప్పుకోకపోవడంతో ఒంటరి పోరుకే మొగ్గుచూపింది. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆప్ పై గుర్రుగా ఉన్నారు. ఏదో విధంగా గొడవ పెట్టుకుంటున్నారు. అది చినికి చినికి గాలివానగా మారి మొత్తం పొత్తుకే గండి పడుతుందున్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాగూ అది ఇండియా గ్రూపు కదా…