గంటాకు చాన్సివ్వని బొత్స – భీమిలీ నుంచి పోటీ చేస్తారా ?

బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ గంటా .. తనకు భీమిలీ టిక్కెట్ కావాలని కోరుతున్నారు. అయితే అనూహ్యంగా బొత్స భీమిలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఖరారు చేయడమే. భార్యను గెలిపించుకునేందుకు … అన్ని స్థానాల్లోనూ తాను చెప్పిన అభ్యర్థులే ఉండాలని.. తాను కూడా భీమిలీ నుంచి పోటీ చేయాలని బొత్స డిసైడయ్యారని అంటున్నారు.

అన్ని నియోజకర్గాలను చక్కబెడుతున్న బొత్స

బొత్స సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ పరిధిలో తనదైన రాజకీయం చేస్తున్నారు. విశాఖ ఎంపీగా ఆయన సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి రంగంలోకి దిగుతున్న విషయం విధితమే. ఈనేపథ్యంలో ఆ పార్లమెంట్‌ పరిధిలోవున్న ఎస్‌.కోట రాజకీయాలపై మంత్రి వ్యూహానికి పదును పెట్టినట్టుగా సమాచారం. వైసిపిలోని అసమ్మతి గ్రూపు టిడిపిలోకి జంప్‌ జిలానికీ రంగం సిద్ధమైన నేపథ్యంలో, అదే టిడిపి నుంచి కీలకనేతతో టచ్‌లోవున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అనుకున్న ప్రకారం జరక్కపోతే వైసిపిలోకి వచ్చేయాలని, భవిష్యత్తులో సముచిత స్థానం వచ్చేలా తాను చూసుకుంటానని, అలా వచ్చేందుకు ఇబ్బంది అయితే పరోక్షంగానైనా సహకరించాలని కోరినట్టు సమాచారం.

అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలకు గాలం

టిడిపిలోనూ రెండు గ్రూపులు ఉన్న నేపథ్యంలో బొత్స వ్యూహానికి ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి అధిష్టానం కూడా అభ్యర్థులను భేరీజు వేయడంతోపాటు బొత్స ప్రభావాన్ని కూడా అంచనా వేస్తోందని, అందుకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టిడిపి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించిన విషయం విధితమే. ఎస్‌.కోట, చీపురుపల్లి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. చీపురుపల్లి వరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోసం అధిష్టానం ఖాళీగా ఉంచింది. ఎస్‌.కోటలో ఇద్దరు నేతలు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ప్రయత్నిస్తున్నారు.

భీమిలీలో బొత్స పోటీ చేసే అవకాశం

ఇప్పుడు గంటా విషయంలో టీడీపీ హైకమాండ్ కూడా ఆలోచించే అవకాశం ఉంది. బొత్స భీమిలీలో పోటీ చేస్తే… ఆయనకు పోటీగా టీడీపీ తరపున గంటానే బరిలోకి దిగుతారు. ఆయన కోరుకున్న టిక్కెట్ వస్తుంది. అలాగే చంద్రబాబు కోరుకున్న పోటీ కూడా జరుగుతుంది. అప్పుడు చీపురుపల్లిలో పని చేసుకుంటున్న కిమిడీ నాగార్జునకే అవకాశం లభిస్తుంది. అయితే గంటా పోటీ చేసే పరిస్థితి ఉంటే.. బొత్స ఆలోచించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.