ప్రధాని మోదీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు మేలు చేసే నిర్ణయాలే తీసుకున్నారు.మద్దతుధర నుంచి సబ్సిడీలు, ఇతర సాయాల విషయంలో ఎక్కడా తాత్సారం చేయలేదు. ప్రధాని స్వయంగా ఆలోచించి ప్రారంభించిన నగదు బదిలీ పథకం పీఎం కిసాన్ తో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందుతోంది. పంట వేసే సమయానికి రైతుల ఖాతాలో డబ్బు పడటంతో విత్తనాలకు, ఎరువులకు, క్రిమిసంహారాల కోసం డబ్బులు వెదుక్కునే అవసరం లేకుండా పోయింది….
వికసిత్ భారత్ సంకల్పయాత్రలో విస్తరణ
పిఎం కిసాన్ పథకాన్ని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మరికాస్త విస్తించారు. నవంబరు 15 నుంచి ఇప్పటి వరకు 90 లక్షల మంది రైతులు కొత్తగా వచ్చి ఈ పథకంలో చేరారు. మహారాష్ట్రలో రెండో రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా మీట నొక్కి లబ్ధిదారులకు రూ. 21 వేల కోట్ల రూపాయల నగదు బదిలీ చేశారు. 2023 ఆగస్టు నాటికి 9.07 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ అందిందని ప్రభుత్వ డేటా చెబుతోంది. తర్వాత వచ్చి చేరిన 90 లక్షల మందితో అది పది కోట్లు దాటింది. సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. కొత్తగా వచ్చిన 90 లక్షల మంది 2.6 లక్షల గ్రామ పంచాయతీలకు చెందినవారుగా ప్రభుత్వం ప్రకటించింది…
2019 నుంచి నిరంతరాయంగా…
రైతులకు మేలు చేసే ప్రభుత్వ చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. తన హామీని నిలబెట్టుకుంటూ పిఎం కిసాన్లో లబ్ధిదారులను పెంచుతున్నారు. 2019లో పిఎం కిసాన్ పథకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ అయ్యాయి. దీన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ అని కూడా పిలుస్తారు..
వెబ్ సైట్లో నమోదు చేసుకుని…
పిఎం కిసాన్ లో ఎప్పటికప్పుడు కొత్తవారిని చేర్చే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్ లో ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ అందుబాటులో ఉంది. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ ఆధారిక ఇ- కేవైసీ పూర్తి చేయవచ్చు. కేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అర్హత ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఏడాదికి రూ.6 వేలు జమ చేస్తోంది. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఈ నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు 15 విడతల్లో నిధులు విడుదల చేయగా.. తాజాగా 16 వ విడత నిధులు విడుదల చేశారు . అయితే, పీఎం కిసాన్ సాయం అందాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకుని ఉండాలి.