రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్రలో బిజీగా ఉన్నారు. అలాగని మౌనంగా ఉంటారంటే అలా చేయలేకపోతున్నారు. బీజేపీ వారిని ఒక మాట అని నాలుగు మాటలు అనిపించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఆ అలవాటు పోగొట్టుకోలేక నోరు జారడం తిట్లు తినడం రివాజుగా మారింది. ఈసారి కూడా అదే జరిగింది…
వారణాసిలో తాగుబోతులున్నారట..
రాహుల్ గాంధీ ఇప్పడో మాట అన్నారు. వారణాసి వీధుల్లో జనం తాగి తందనాలు ఆడుతున్నారని, ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ నియోజకవర్గమైన కాశీలో ఈ పరిస్థితి ఉత్తర ప్రదేశ్ ముఖచిత్రానికి నిదర్శనమని కూడా రాహుల్ దెప్పిపొడిచారు. ” నేను వారణాసి వెళ్లాను. అక్కడ రాత్రి పూట సంగీతం వినిపిస్తోంది. జనం తాగి రోడ్లమీద పడి దొర్లుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం తాగిన మైకంలో తూగుతున్నట్లుగా ఉంది..మరో పక్క అయోధ్యలో రామమందిరం ఉంది. దాని ప్రారంభోత్సవానికి అదానీ, అంబానీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. అక్కడ అంతా బిలియనీర్లే కనిపించారు. ఒక్క సామాన్యుడు కూడా కనబడలేదు, ” అని రాహుల్ ధ్వజమెత్తారు.
యూపీనే అవమానించారంటున్న ఇరానీ….
రాహుల్ వ్యాఖ్యలపై స్మృతీ ఇరానీ తీవ్ర స్వరంగా విరుచుకుపడ్డారు. యూపీ పట్ల రాహుల్ మనసులో ఎంత విషముందో ఈ మాటలను బట్టి అర్థమవుతుందని ఇరానీ వ్యాఖ్యానించారు. వాయనాడ్ వెళ్లి యూపీ ఓటర్లను అవమానపరిచారని, ఇప్పుడు తాగుబోతుతనం గురించి మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యాక్రమానికి పిలిస్తే రాకుండా ఇప్పుడు పవిత్ర కాశీ ప్రజలపైనా, ఉత్తర ప్రదేశ్ యువతపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరానీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ భవిష్యత్తు చీకట్లో మగ్గిపోతోందని, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందన్నసంగతి ఓర్వలేకే రాహుల్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు..
దమ్ముంటే అమేఠీలో పోటీ చెయ్యి…
రాహుల్ గతంలో అమేఠీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓడిపోతానని అర్థం చేసుకుని ముందు జాగ్రత్త చర్యగా కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అనుకున్న ప్రకారమే అమేఠీలో ఓడిపోయి వాయనాడ్‌లో గెలిచారు. ఇప్పుడు స్మృతీ ఇరానీ మళ్లీ అదే సవాలు విసురుతున్నారు. దమ్ముంటే కేవలం అమేఠీలో పోటీ చేసి గెలవాలని ఆమె సవాలు విసిరారు. తాను ఎంపీ అయిన తర్వాత ప్రధాని మోదీ ఆశీస్సులతో అమేఠీ అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ పెట్టుబడుల సదస్సులో అమేఠీకి మాత్రమే ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ వస్తే అమేఠీ వీధులు ఖాళీగా కనిపించాయని ఆయన్ను చూసేందుకు ఎవ్వరూ రాలేదని ఇరానీ గేలి చేశారు. అమేఠీ ప్రజలు సోనియా కుటుంబాన్ని అసహ్యించుకుంటున్నారని ఇరానీ వ్యాఖ్యానించారు….