బయటకు వెళ్లే దారేదీ….

కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అసలు పార్టీ ఉంటుందా, ఊడుతుందా అన్నది అర్థం కాని అయోమయ స్థితి అక్కడి సీనియర్ నేతలకు కలుగుతోంది.లోక్ సభ ఎన్నికల్లోపు పార్టీ ఖాళీ కావడం ఖాయమనిస్తుంది. ఒకరిద్దరు నేతలను ఆపుకోగలిగినా గుంపుగా వెళ్లేవారిని ఏమీ చేయలేకపోతున్నారు. కమల్ నాథ్ బీజేపీలోకి వెళ్లకుండా ఆపగలిగామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నప్పటికీ ఆయన రాష్ట్రం మధ్యప్రదేశ్లో పరిస్థితి ఏమంత బాగోలేదు. గత ఐదేళ్లలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నుంచి 62 మంది సీనియర్లు వెళ్లిపోయారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోందో ఓ సారి చూద్దాం….

దెబ్బతీసిన కుటుంబ వారసత్వం…

కాంగ్రెస్ రాజకీయాలు ఒక కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. ఎంతటి యువ నాయకుడు పార్టీలో పనిచేయాలన్న ముందు ఆ కుటుంబానికి విధేయతను ప్రకటించాలి. పార్టీ లాయల్టీ కంటే ఫ్యామిలీ భక్తి ఎక్కువ ఉన్న వాళ్లే పార్టీలో రాణిస్తారు. పార్టీ శ్రేణులను సైన్యంగానూ, సోనియా కుటుంబాన్ని చక్రవర్తులుగానూ అక్కడ పరిగణిస్తారు. అదే ఇప్పుడు సిన్సియర్ లీడర్స్ పార్టీకి దూరం జరిగేందుకు దోహదపడింది…

హిందూ వ్యతిరేక ధోరణి..

మైనార్టీలను దగ్గరకు చేర్చుకుంటే ఓట్లు రాలతాయని భావించిన కాంగ్రెస్ మెజార్టీ హిందూ వర్గాన్ని దూరం చేసుకుంది. దేశం మొత్తం భక్తి భావంతో మునిగిన తరుణంలో రామాలయ నిర్మాణాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. రామ లల్లా ప్రాణప్రతిష్ఠకు వెళ్లకపోవడంతో ఆ పార్టీకి హిందూ వ్యతిరేకి అన్న ముద్ర పడింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి డీఎంకేతో పొత్తు తమిళనాడులో ప్రయోజనం కలిగించి ఉండొచ్చు. ఉత్తరాదిన మాత్రం ఆ పార్టీకి చావు దెబ్బకొట్టింది.

రాహుల్ గాంధీ పిల్లచేష్టలు

రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాంటివ్యక్తిని భావి ప్రధాని అంటూ కాంగ్రెస్ తో కొందరు ప్రచారం చేయడంతో ఇతరులు ఆగ్రహం చెంది పనిచేయడం మానేశారు. అందులో కొందరు దూరం జరిగారు. జాతీయ భద్రతపై రాహుల్ ఆలోచన ఎవ్వరికీ నచ్చలేదు. విదేశీ పర్యటనలో దేశం పట్ల చేసిన వ్యాఖ్యలు ఎవ్వరికీ నచ్చలేదు. చైనా, పాకిస్థాన్ విషయంలో రాహుల్ అభిప్రాయాలను సొంత పార్టీ నేతలే ఖండించారు.

క్షేత్ర స్థాయి సంబంధాలు తెగిపోవడం..

ఈ సారి ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం పార్టీ నేతల్లో పూర్తిగా లోపించింది. పార్టీకి భవిష్యత్తు లేదన్న అనుమానాలు మొలకెత్తాయి. అగ్రనేతలు, రాష్ట్ర నేతలు అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మానేశారు. అసలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉంటారన్నదే వాళ్లు మరిచిపోయినట్లుగా కనిపించింది. దానితో పార్టీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పునాదులు కదిలిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కమ్యూనికేషన్ లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..